Why Conch Ketki Flowers Not Used In Lord Shiva Puja Know Here

Why Conch Ketki Flowers Not Used In Lord Shiva Puja Know Here

Maha shivratri 2024: శివపూజకు మొగలి పువ్వు, శంఖం ఎందుకు పనికిరావు..?

Mahashivratri: పురాణాల ప్రకారం.. మొగలి పువ్వు, శంఖం శివపూజకు పనికిరావు. ఎందుకో తెలుసుకోండి.

మహా శివరాత్రికి భక్తులు సిద్ధమవుతున్నారు. పరమేశ్వరుడి అనుగ్రహం పొందేందుకు ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే శివుడిని కొలిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శివుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన్ను పూజించేటప్పుడు తెల్లని పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు.

అయితే తెల్లగా, అందంగా ఉన్న ఒక పువ్వును ఈశ్వరునికి సమర్పించరు. అదే మొగలి పువ్వు. దీన్ని కేతకి పుష్పం అని కూడా అంటారు. అలానే శివుడి ముందు శంఖం ఊదరు, ఉంచరు. పురాణాల ప్రకారం.. మొగలి పువ్వు, శంఖం శివపూజకు పనికిరావు.

శివుడికి మొగలి పువ్వు ఎందుకు సమర్పించకూడదనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ, విశ్వానికి రక్షకుడు అయిన విష్ణువు మధ్య ఒకప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే వివాదం జరిగింది. వివాదం తీవ్రస్థాయికి చేరడంతో వారు శివుడిని పిలిచి నిర్ణయం చెప్పమని కోరారు.

అప్పుడు శివుడు తన శక్తులను ఉపయోగించి జ్యోతిర్లింగాన్ని సృష్టిస్తాడు. జ్యోతిర్లింగం మొదలు, చివర్లను ఎవరు ముందుగా గుర్తిస్తారో వారు గొప్పని చెప్పాడు. బ్రహ్మ, విష్ణువు లింగం మొదలు, చివరను కనుగొనడానికి చెరొక వైపు వెళ్తారు. బ్రహ్మదేవుడు కిందికి వెళ్లగా విష్ణువు ఆ జ్యోతిర్లింగం పైకి బయలుదేరుతాడు.

బ్రహ్మదేవుడు దిగి వెళుతున్నప్పుడు, అదే దిశలో ఒక మొగలి పువ్వు వెళ్లడం చూశాడు. తాను జ్యోతిర్లింగం మొదలును చూసినట్లు శివునికి చెప్పాలని కేతకి పుష్పాన్ని బ్రహ్మ ఒప్పిస్తాడు. అలా అబద్ధం చెప్పమని ఒప్పించాడు. తనతో పాటు శివుని వద్దకు తీసుకువెళ్లాడు.

బ్రహ్మ దేవుడు ఈ జ్యోతిర్లింగం మొదులును కనుగొన్నట్లు శివునికి చెప్పాడు. అవునని కేతకి పుష్పం కూడా తప్పుడు సాక్ష్యం చెబుతుంది. మరోవైపు, విష్ణువు చాలా ప్రయత్నించి జ్యోతిర్లింగం చివరి ముగింపును కనుగొనలేకపోయాడని చెబుతాడు.

బ్రహ్మ దేవుడు అబద్ధం చెబుతున్నాడని శివుడికి తెలుసు. మొగలి పువ్వు ఆయనకు తప్పుడు సాక్ష్యం ఇచ్చింది. దీంతో శివుడు కోపోద్రిక్తుడయ్యాడు. బ్రహ్మదేవుని ఒక తలను వేరు చేశాడు. తర్వాత మొగలి పువ్వు తన పూజ నుంచి శాశ్వతంగా దూరమవుతుందని శపించాడు. ఆ రోజు నుంచి శివునికి మొగలి పూలు సమర్పించడం పాపంగా భావిస్తున్నారు.

శంఖం ఎందుకు సమర్పించకూడదు?

హిందూ మతంలో శంఖం పవిత్రమైనది. శుభ సందర్భాలలో, పూజ, ఇతర ఆచారాలకు దీన్ని ఉపయోగిస్తారు. దేవతా మూర్తులను పూజిస్తున్నప్పుడు శంఖం ఊదుతారు. వాటిని ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అయితే శివపూజ సమయంలో శంఖాన్ని వాడకూడదు, ఊదకూడదు.

పురాణాల ప్రకారం, శంఖచూడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు తన దురాగతాలతో భూమిపైనే కాకుండా ప్రపంచం మొత్తాన్ని విధ్వంసం సృష్టించాడు. శంఖచూడి దుశ్చర్యలతో కలత చెందిన దేవతలు, శివుని వద్దకు వెళ్లి రాక్షసుడి నుంచి రక్షించమని వేడుకున్నారు. శివుడు తానే వెళ్లి చంపేస్తానని బదులిచ్చాడు. రాక్షసుడితో యుద్ధానికి దిగాడు.

ఇద్దరి మధ్య యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. శివుడు తన త్రిశూలంతో శంఖచూడుడిని చంపడంతో యుద్ధం ముగిసింది. శంఖచూడు బూడిదగా మారిన తరువాత, అతని శరీర బూడిద నుంచి శంఖం ఉద్భవించింది. శివుడు శంఖచూడను సంహరించినందున, శంఖాన్ని అందరి దేవుళ్ల పూజలో ఉపయోగిస్తారు. అయితే శివుడే ఆ రాక్షసున్ని సంహరించిన కారణంతో, ఆయనకు చేసే పూజలో శంఖాన్ని సమర్పించరు.

(Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమేగమనించగలరు.)

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి