YS Jagan To File Nomination In Pulivendula On April 25

YS Jagan To File Nomination In Pulivendula On April 25

క్లైమాక్స్‌కి మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. పులివెందులలో నామినేషన్‌ వేయనున్న సీఎం జగన్..

వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు వైసీపీలో చేరారు. సీఎం జగన్‌ బస్సుయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ అక్కివలస నుంచి మొదలైన యాత్ర… ఎచ్చెర్ల, శ్రీకాకుళం బైపాస్‌, సింగుపురం, కోటబొమ్మాళి, పరశురాంపురం మీదుగా సాగనుంది. సాయంత్రం అక్కవరం చేరుకుని బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం అక్కవరం హెలిప్యాడ్‌ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుని..అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకోనున్నారు.

రేపు నామినేషన్..

రేపు పులివెందుల అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తారు జగన్‌. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే… అంతకుమించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళిక సిద్ధం చేశారు సీఎం జగన్‌. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొంటారు సీఎం జగన్‌.

2100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర

మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగింపు కానుంది.. ఈరోజుతో కలిపి 2100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర సాగింది. మొత్తం 86 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్‌.. ఇప్పటివరకు 15 బహిరంగసభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9చోట్ల భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇవాళ అక్కవరంలో 16వ సభలో సీఎం జగన్‌ పాల్గోననున్నారు. అక్కవరంలో సభ తర్వాత తాడేపల్లికి సీఎం జగన్ బయలుదేరుతారు. రేపు పులివెందులకు వెళ్లి నామినేషన్‌ వేయనున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి