Health Benefits With Garlic Tea

Health Benefits With Garlic Tea

అల్లం టీ మాత్రమే కాదు.. వెల్లుల్లి టీతో కూడా ఎన్నో లాభాలు..

సాధారణంగా మనందరికీ అల్లం టీ గురించి తెలిసి ఉంటుంది. టీలో అల్లం వేసుకుని తాగుతుంటారు. అల్లంలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం అల్లం టీ మాత్రమే కాదు. వెల్లుల్లి టీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుందని మీకు తెలుసా.? ఇంతకీ వెల్లుల్లి టీతో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటి.? ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దాదాపు ప్రతీ ఒక్క వంటంకంలో ఉపయోగించే వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక వెల్లుల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో క్రీయాశీలకంగా పనిచేస్తాయి.

రక్తం గడ్డకట్టకుండా ఉండడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ వెల్లుల్లి టీని తీసుకోవడం ద్వారా కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్‌ వంటి ప్రమాదాలను రాకుండా చూసుకోవచ్చు. వెల్లుల్లి టీ తీసుకోవడం వల్ల బరువు పెరగడం అదుపులో ఉంటుంది. జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతీరోజూ ఉదయం వెల్లుల్లి టీ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.

వెల్లుల్లి టీని ఎలా తయారు చేసుకోవాలంటే..

ఇందుకోసం ముందుగా 2-3 తరిగిన వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు నీరు, 1/2 టీస్పూన్ అల్లం రసం, 1/4 టీస్పూన్ తేనెతో పాటు నిమ్మరసం తీసుకోవాలి. ముందుగా ఒక పాత్రలో నీటిని పోసి మరిగించాలి. అనంతరం వేడి నీటిలో వెల్లుల్లి వేసి ఐదు నిమిషాలు బాగా మరిగించాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి వెల్లుల్లి నీటికి అల్లం రసం, తేనె కలపాలి. ఇక చివరిగా వడకట్టుకొని రుచికి అనుగుణంగా నిమ్మరసం కలుపుకొని తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి