Ysrcp To Conduct Fourth Siddham Sabha In Near Medarametla And Announce Manifesto For Ap

Ysrcp To Conduct Fourth Siddham Sabha In Near Medarametla And Announce Manifesto For Ap

YCP Siddham: నేడు వైసీపీ 4వ సిద్ధం సభ.. మేనిఫెస్టో రిలీజ్

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత హాట్ టాపిక్ ఏది అంటే.. అది వైసీపీ సిద్ధం సభే. ఎందుకంటే.. ఇప్పటికే 3 సభల్లో ఆ పార్టీ భారీగా జన సమీకరణ చేపట్టింది. ఇక నాలుగోది, చివరి సభగా చెప్పిన ఆ పార్టీ.. దీనికి రాయలసీమ జిల్లాల నుంచి 15 లక్షల మందిని తరలించాలని ప్లాన్ చేసింది. అంత మందిని తరలించడం ద్వారా.. ప్రజలు తమవైపే ఉన్నారని ఆ పార్టీ చెప్పాలనుకుంటోంది. అందువల్ల ప్రకాశం జిల్లా.. బాపట్ల.. అద్దంకిలోని.. మేదరమెట్ల దగ్గర, హైవే పక్కన జరిగే నాలుగో సిద్ధం సభ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మేనిఫెస్టో రిలీజ్:

ఈ సిద్ధం సభ ప్రత్యేకత ఏంటంటే.. మేనిఫెస్టో. గత ఎన్నికల్లో వైసీపీ.. నవరత్నాల పథకాలను ప్రకటించింది. జస్ట్ 2 పేజీలతో మేనిఫెస్టో ఇచ్చింది. అది ప్రజలకు నచ్చడంతో.. భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ పార్టీ చిన్న మేనిఫెస్టోనే ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఐతే.. గత మేనిఫెస్టోని 98 శాతం అమలు చేశామంటున్న వైసీపీ.. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు నిధులను పెంచడంతోపాటూ.. ఒకట్రెండు అదనపు పథకాలను కూడా మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే.. ఆచరణ సాధ్యం కాని పథకాలు కొన్నింటిని వైసీపీ నేతలు సూచించినా, వాటిని సీఎం జగన్ పక్కన పెట్టారని తెలుస్తోంది. అందువల్ల ఇవాళ్టి మేనిఫెస్టో సాధారణంగానే ఉంటుందని సమాచారం.

భారీ సభ:

ఇవాళ్టి సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టడం ద్వారా.. వైసీపీ నేతలు, శ్రేణుల్లో కూడా కాన్ఫిడెన్స్ బాగా పెంచేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో టీడీపీ+జనసేన+బీజేపీ చేతులు కలపడంతో.. ఆ మూడు పార్టీలనూ నేడు జగన్ టార్గెట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. సింహం సింగిల్‌గా వస్తుందనీ.. ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా వచ్చినా, వైసీపీని ఏమీ చెయ్యలేవని ఆ పార్టీ నేతలు పదే పదే అంటున్నారు.

4వ సిద్ధం సభ 100 ఎకరాల్లో ఉంటుంది. ఇందుకు ఏర్పాట్లు వారం నుంచీ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. తద్వారా ఎక్కడ ఉన్నవారైనా.. వేదికను స్పష్టంగా చూసే వీలు ఉంటుంది అంటున్నారు. ఇది చివరి సిద్ధం సభ కావడం వల్ల, ఈ సభలోనే శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత.. జిల్లాల్లో నేతల ప్రచారం ఉంటుంది. ఐతే.. జగన్ నెక్ట్స్ ప్రచారం ఎలా సాగుతుంది అనేది పార్టీ వర్గాలు ఇంకా చెప్పలేదు.

ఇప్పటివరకూ వైసీపీ.. భీమిలీ, దెందులూరు, రాప్తాడులో సిద్ధం సభలు నిర్వహించింది. వీటికి ఒకదాన్ని మించి, మరొకటిగా జనం వచ్చారు. అందువల్ల.. నాలుగో సభకు మరింత ఎక్కువగా వస్తారనే అంచనా ఉంది. పైగా ఈ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తారని తెలిసింది. సభకు వచ్చేవారికి ఆహారం, నీరు, మౌలిక సౌకర్యాలు, తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం అన్నీ కల్పిస్తామని వైసీపీ తెలిపింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి