TSCHE Issued Key Instructions For Students Appearing For TS EAMCET 2024 Exam

TSCHE Issued Key Instructions For Students Appearing For TS EAMCET 2024 Exam

TS EAPCET 2024 Exam Day Guidelines: ఈఏపీసెట్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. గోరింటాకు, టాటూలు ఉంటే పరీక్ష కేంద్రాల్లోకి నో ఎంట్రీ!

తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకూ 3.54 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీం కోర్సుల‌కు, మే 11, 12 తేదీల్లో అగ్రిక‌ల్చర్, ఫార్మసీ స్ట్రీం కోర్సుల‌కు ప్రవేశ ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నట్లు ఇప్పటికే షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు జేఎన్‌టీయూలో సోమవారం (ఏప్రిల్‌ 29) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పరీక్షల తేదీల్లో పాటించవల్సిన ముఖ్యమైన విధివిధానాల గురించి అధికారులు తెలియజేశారు.

మే 1వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయా పరీక్షల తేదీల్లో విద్యార్ధులను 90 నిమిషాల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని అన్నారు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈసారి కూడా అప్లికేషన్లు భారీగానే వచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో ఈసారి 20 పరీక్ష కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే రోజు మరో పరీక్ష కూడా రాయాల్సి ఉంటే మాత్రం అటువంటి విద్యార్థులు ముందుగానే విజ్ఞప్తి చేసుకోవాలని, వారందరికీ అనుకూలమైన తేదీలో పరీక్ష నిర్వహించేలా చూస్తామని అన్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకూ మొత్తం 3,54,803 దరఖాస్తులు అందినట్లు ఈఏపీసెట్‌ కన్వీనర్‌ డీన్ కుమార్ పేర్కొన్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 2,54,543 మంది, అగ్రికల్చర్- ఫార్మాకు 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే విద్యార్ధుల చేతులకు గోరింటాకు, టాటూలు వంటి ఉండరాదని, అటువంటి వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని హెచ్చరించారు. మొత్తం 21 జోన్లలో పరీక్ష నిర్వహిస్తున్నామని.. వీటిల్లో తెలంగాణలో 16 జోన్లు ఏర్పాటు చేయగా, ఏపీలో 5 జోన్‌లు ఉన్నాయని అన్నారు. ఇంజినీరింగ్‌కు 166 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్ అండ్ ఫార్మాకు 135 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కనీసం 20 నిమిషాల ముందే విద్యార్ధులు తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఏడాది నోటిఫికేషన్‌ సమయానికి.. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు పూర్తి కాలేదన్నారు. దీంతో ఈ ఏడాది కూడా ఏపీ విద్యార్థులకు కూడా ఈఏపీసెట్‌ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పించనున్నట్లు ఆయన అస్పష్టంచేశారు. ఈ ఏడాది అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫేషియల్‌ రికగ్నేషన్‌ ద్వారా అభ్యర్థుల గుర్తింపును అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి