Ayodhya Ram Mandir Inauguration Lord Ramlalla First Photo Details

Ayodhya Ram Mandir Inauguration Lord Ramlalla First Photo Details

500 ఏళ్ల నిరీక్షణకు తెర.. అయోధ్య రాముడి తొలి దర్శనం మీరూ చూసేయండి

5 శతాబ్దాల హిందువుల కల సాకారమైంది. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువుదీరాడు. దానికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. ఒక చేతిలో విల్లు..మరో చేతిలో బాణంతో.. అందమైన రూపంతో అద్భుతంగా ఉంది రామయ్య విగ్రహం.

500 ఏళ్ల హిందువుల నిరీక్షణకు తెరపడింది. అయోధ్యకు రామయ్య వచ్చేశాడు. గర్భగుడిలో కొలువుదీరాడు. భక్తులకు తొలి దర్శనమిచ్చాడు.

గర్భగుడిలో ప్రతిష్ఠించిన రామ్‌లలా ఫొటోలు బయటకు వచ్చాయి. సాలగ్రామ శిలతో రూపొదించిన శ్రీరాముడి దివ్య రూపం అద్భుతంగా ఉంది.

కమలం పువ్వుపై నిలబడిన బాల రాముడి ఒక చేతిలో బాణం.. మరో చేతిలో విల్లు ఉంది. నలుగుపు రంగులో ఉన్న అయోధ్య రాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. అంటే దాదాపు 4 అడుగులు ఉంటుంది.

అయోధ్యలో ప్రతిష్టించే బాల రాముడి విగ్రహం కోసం 3 విగ్రహాలు చేయించగా.. వాటిలో అరుణ్ యోగిరాజ్ విగ్రహానికి ఆమోదం లభించింది. కోట్ల మంది ఆరాధించే రాముడి ప్రతిరూపం ఇదే. మిగిలిన రెండు విగ్రహాలను కూడా రెండు, మూడో అంతస్తుల్లో ప్రతిష్టిస్తారు.

ఇక రామజన్మభూమిలో మొత్తం 70 ఎకరాల్లో శ్రీరాముడి ఆలయ కాంప్లెక్స్‌ ఉంటుంది. అందులో 70శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది. భక్తులు తూర్పు దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవేశించి దక్షిణ దిక్కు నుంచి బయటకు వస్తారు.

భక్తులు ఆలయంలోకి వెళ్లాలంటే మొత్తం 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. జీ+2 పద్ధతిలో ప్రతి ఫ్లోర్‌ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి అంతస్తులో 392 చొప్పున స్తంభాలు, 44 ప్రవేశమార్గాలు ఉంటాయి.

ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పున, 732 మీటర్ల వైశాల్యంతో కైవారం నిర్మించారు. సూర్యుడిని తలపించేలా 30 అడుగుల ఎత్తున నిర్మించిన 40 స్తంభాలు అయోధ్య నగరంలో రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఇప్పటికే అయోధ్య వీధులు భక్తులతో నిండిపోయాయి. సామాన్యులుకొన్ని రోజుల పాటు అయోధ్యకు రావొద్దని చెబుతున్నా.. భక్తులు మాత్రం వెళ్తూనే ఉన్నారు.

జనవరి 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒకపూట సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అన్ని కార్యాలయాలు మూసివేసి ఉంటారు. ఇక యూపీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు కూడా సెలవును ప్రకటించాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి