JEE Advanced 2024 Registration Begins

JEE Advanced 2024 Registration Begins

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే!

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Advanced 2024) అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటన వెలువరించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్ధులు ముమ్మరంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ ఏడాది రెండు సార్లు నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో పరీక్షలలో నిర్ణీత కటాఫ్‌ పర్సంటైల్‌ సాధించిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7వ తేదీతో దరఖాస్తులు ముగుస్తాయి. చివరి తేదీ వరకు నిరీక్షించకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీయే సూచించింది. మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరణకు అవకాశం ఉంటుంది.

కాగా తొలుత నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 21 నుంచి 30 వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ జరగవల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రిత్యా షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు ఐఐటీ- మద్రాస్‌ ప్రకటించింది. అయితే పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. తొలుత ప్రకటించిన విధంగానే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష మే 26వ తేదీన యథావిథిగా నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రాసేందుకు 2.5 లక్షల మందికి మాత్రమే అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1, 2లకు కలిపి మొత్తం 24 లక్షల మంది ఈ ఏడాది పోటీ పడిన సంగతి తెలిసిందే.

దరఖాస్తు ఫీజు చెల్లింపులు మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చారు. అడ్మిట్‌ కార్డులు మే 17 నుంచి 26 వరకు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు. మే 26వ తేదీన ఉదయం పేపర్‌ 1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్‌లో పేపర్‌ 2 పరీక్ష 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక మే 31న రెస్పాన్స్‌ షీట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రైమరీ ఆన్సర్‌ కీ జూన్‌ 2న విడుదల చేస్తారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్‌ 9న ఉదయం 10 గంటలకు ఫలితాలతోపాటు ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’ కూడా విడుదల చేస్తారు. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. జూన్‌ 10 నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది

JEE Advanced 2024 Online Registration Click here

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి