YSRCP Chief CM YS Jagan Slams Chandrababu Naidu Over AP Development In Election Campaign

YSRCP Chief CM YS Jagan Slams Chandrababu Naidu Over AP Development In Election Campaign

YS Jagan: పేదలకు, మోసాలకు మధ్య జరిగే ఎన్నికలు.. ఆలోచించి ఓటు వేయండి.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం పీక్స్‌కి చేరింది. వైసీపీ అధినేత.. సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చోడవరం, అంబాజీపేటలో జరిగిన వైసీపీ బహిరంగ సభల్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని.. ఇది జగన్‌కు చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం కాదన్నారు. పేదలకు, మోసాలకు మధ్య ఎన్నికలంటూ జగన్‌ అన్నారు. జగన్‌ ఒక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ కుట్రలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌ను ఎందుకు ఓడించాలి..? బాబుకు ఎందుకు ఓటు వేయాలో మీరే ఆలోచించాలంటూ జగన్‌ ప్రజలను కోరారు. 2014లో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలు చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదని.. 175 అసెంబ్లీ,  25 ఎంపీ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని.. ఎక్కడా తగ్గేదేలే అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో హీరో ఎవరో.. విలన్‌ ఎవరో గుర్తించి ఓటు వేయాలంటూ ప్రజలను కోరారు.

ఎన్నికల్లో జగన్‌కు ఓటువేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి..చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలికినట్టేనని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది.. రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తుంది.. చంద్రబాబుకు ఓటేయడమంటే విషసర్పాన్ని నమ్మడమేనన్నారు. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామని.. అభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని సీఎం జగన్ కోరారు.

చంద్రబాబును నమ్మితే అంతా గోవిందా..గోవిందా.. చంద్రబాబును నమ్మితే మళ్లీ మోసపోవడం ఖాయమంటూ సీఎం జగన్‌ ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. చంద్రబాబు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను గాలికొదిలేశారన్నారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అంటూ చంద్రబాబు అండ్‌ కో చెబుతున్నారని..వాటిని నమ్మొచ్చా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్‌.

చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బు చాలా ఉందని.. ఆ డబ్బుతో ఓట్లు కొనడటానికి వస్తున్నారని హెచ్చరించారు జగన్‌. డబ్బు తీసుకుని.. నిజాయితీగా పనిచేసే వారికి ఓటు వేయాలని విజ్ఙప్తి చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి