గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి. ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వంశానుగతంగా వచ్చే జన్యువులు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి హృద్ధమనుల వ్యాధులకు కారణమవుతున్నాయి. అయితే ఈ రోజుల్లో పిల్లలు, ఆడ, మగ, వయసుతో సంబంధం లేకుండా అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. సాధారణంగా హార్ట్ ఎటాక్ మగవాళ్లకు ఎక్కువగా వస్తుందనుకుంటారు. కానీ ఇటీవల నమోదవుతున్న కేసులు మహిళలకూ గుండె సమస్యలు పెరిగాయని చెబుతున్నాయి. గుండెపోటు లక్షణాలు అందరికీ కామన్‌గా ఉంటాయి.
అయితే కొన్ని సంకేతాలు పురుషులు, స్త్రీలలో వేర్వేరుగా ఉండవచ్చు. మహిళలు ఈ తేడాలను గుర్తిస్తే వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అందించవచ్చు. నిర్లక్ష్యం వద్దు.. కొంతమంది మహిళలు గుండె లక్షణాలను ఎసిడిటీ లేదా స్ట్రెస్ వంటి ఇతర సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళలకు ఛాతీలో ఎక్కువ అసౌకర్యం, భారం లేదా ఎసిడిటీ ఉంటే, వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లాలి. వైద్యులు ECG చేయించి, అవసరమైన ట్రీట్‌మెంట్ అందిస్తారు. వారికి ఎక్కువ రిస్క్.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్న మహిళలు గుండెపోటుకు గురికావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ (బొడ్డు కొవ్వు, హై ట్రైగ్లిజరైడ్స్, ఇన్సులిన్ సమస్యలు, గ్లూకోజ్ ఇన్‌టోలెరెన్స్) ఉంటే ఈ ముప్పు మరింత పెరుగుతుంది.
పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ (PCOS) ఉన్న మహిళలు, ఏవైనా అసాధారణ లక్షణాల గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. గుండె ఆరోగ్యం జాగ్రత్త.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, మహిళలు రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. బ్యాలెన్స్‌డ్ డైట్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. అయితే మహిళలు నిర్లక్ష్యం చేయకూడని కొన్ని లక్షణాలు ఉన్నాయి. విపరీతమైన అలసట.. స్నానం చేయడం వంటి సాధారణ పనుల తర్వాత చాలా అలసటగా అనిపిస్తే అప్రమత్తమవ్వాలి. ఊపిరి పీల్చుకోవడం లేదా చెమట పట్టినట్లు అనిపించడం గుండె సమస్యకు సంకేతం. దవడ నొప్పి లేదా భుజం మధ్య నొప్పి శారీరక శ్రమ సమయంలో దవడలో లేదా భుజాల మధ్య నొప్పి వస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నిరంతర జీర్ణ సమస్యలు.. పొట్ట ఉబ్బరం లేదా ఉబ్బినట్లు అనిపించడం జీర్ణ సమస్యగా అనిపించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది గుండెపోటును సూచిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఊపిరి ఆడకపోవడం ఫిజికల్ యాక్టివిటీ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా రాత్రిపూట పడుకొన్న తర్వాత అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావడం గుండె జబ్బులకు సంకేతం. పైకి లేచి కూర్చున్న తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోతే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎగువ బొడ్డు నొప్పి ఎగువ బొడ్డులో వివరించలేని నొప్పి చాలా అరుదుగా కనిపిస్తుంది. అలా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. ఇతర కారణాలేవీ కనిపించకపోతే, వైద్యుల సలహాతో ECG చేయించుకోవాలి.