ఉత్తర భారతదేశంలో చలిగాలులు ఉత్తరప్రదేశ్‌లో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌లో డజన్ల కొద్దీ ప్రజలు బ్రెయిన్ స్ట్రోక్‌లు, అతి శీతల వాతావరణం వల్ల గుండెపోటుల కారణంగా మరణించారు. శీతాకాలంలో తమను తాము సురక్షితంగా ఉంచుకోవడం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చల్లటి వాతావరణంలో అకస్మాత్తుగా రక్తపోటు పెరగడం వల్ల చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వచ్చినట్లు ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే ఈ కాలంలో అధిక రక్తపోటు, మధుమేహం , గుండె జబ్బులు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో రక్తపోటు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి, డాక్టర్లు చెప్పినట్లు క్రమం తప్పకుండా రక్తపోటును చెక్ చేసుకోవాలి.
వాళ్లు సూచించిన మందులను సరిగ్గా వాడాలి. చలి నుంచి రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులు వేసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. యోగా, ధ్యానం లాంటివి చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. అధిక కేలరీలు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఈ చలికాలంలో స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు. చలికాలంలో స్నానం చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోల్డ్ వాటర్ గుండె వేగం, రక్తపోటు, శ్వాస వేగాన్ని ఒక్కసారిగా పెంచుతుంది. దీనివల్ల గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది.
అంతేకాకుండా చల్లటి నీరు రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది, దీనివల్ల రక్త ప్రవాహం తగ్గి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. సురక్షితంగా ఉండటానికి, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎప్పుడూ తలపై నేరుగా చల్లటి నీరు పోయకూడదు, ఎందుకంటే ఇది శరీర విధుల్లో ఆకస్మిక మార్పులకు కారణమవుతుంది. కోల్డ్ వాటర్ కుమ్మరించే షవర్లను కూడా అవాయిడ్ చేయాలి. బదులుగా సౌకర్యవంతమైన, వెచ్చని వాతావరణంలో స్నానం చేయడానికి ప్రయత్నించాలి. స్ట్రోక్ (పక్షవాతం) లక్షణాలను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. స్ట్రోక్ లక్షణాలు ఒక్కొక్కసారి చాలా తేలికగా అనిపించవచ్చు, కానీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
ముఖ్యంగా ముఖంలో ఒకవైపు భాగం కిందకి వంగిపోయినట్లు లేదా తిమ్మిరిగా ఉండటం స్ట్రోక్‌కు సూచన కావచ్చు. అలాగే చేతులు పైకెత్తమని అడిగినప్పుడు ఒక చేయి బలహీనంగా ఉండటం లేదా కిందకు పడిపోవడం గమనించవచ్చు. మాటలు తడబడటం లేదా అస్సలు మాట్లాడలేకపోవడం కూడా స్ట్రోక్ లక్షణాలలో ఒకటి. ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. సమయానికి చికిత్స అందిస్తే తీవ్రమైన సమస్యలు లేదా మరణాన్ని కూడా నివారించవచ్చు.