చంద్రబాబు, పవన్ కల్యాణ్ మార్ఫింగ్ ఫొటోల కేసుకు సంబంధించిన ఆయనను శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఒంగోలు రూరల్ పోలీస్టేషన్‌లో విచారణ చేపట్టారు. మొత్తం 50 ప్రశ్నలను పోలీసులు సంధించారు. 44 ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పారు. కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదు అని ఆర్జీవీ తెలిపారు.
అయితే ఈ నేపథ్యంలో, వర్మకు మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు అందజేశారు. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వర్మను ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు చూస్తే.. 2019లో వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమాను రూపొందించారు.
ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ గతేడాది నవంబర్ 29న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వర్మపై సీఐడీ కేసు నమోదు చేసింది. తాజాగా, ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి.