Rami Reddy | తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు విలన్ అంటే జనాలు దడుసుకునేవాళ్లు. స్క్రీన్ పైనే కాదు.. బయట కనిపించినా ప్రేక్షకులు భయంతో వణికిపోయేవారు. అంతగా తమ నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేశారు కొందరు నటులు. అందులో రామి రెడ్డి ఒకరు. ఈతరం ప్రేక్షకులకు ఆయన గురించి అంతగా తెలియదు. కానీ 90వ దశకంలో మాత్రం ఆయన పేరు వినని సినీప్రియులు ఉండరు. రామిరెడ్డి చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని ఓబుళంవారిపల్లెలో జన్మించాడు. ఆయన చదువంతా హైదరాబాదులోనే సాగింది.
ఉస్మానియా యూనివర్శిటీ నుంచి జర్నలిజంలో పట్టా పొందిన ఈయన నటుడు కాక మునుపు ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రామిరెడ్డి మంచి బాస్కెట్‌బాల్ ప్లేయర్ కూడా. మొదట అంకుశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రామిరెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అంకుశం చిత్రంలో విలన్ పాత్రలో ఒదిగిపోయారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
దీంతో ఆయనకు ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, భోజ్ పురి భాషలలో నటించి తన మార్క్ చూపించారు.250కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు రామిరెడ్డి. ఆయన చివరి చిత్రం మర్మం. అయితే వెండితెరపై ఆయన ఎక్కువగా విలన్ పాత్రలే పోషించారు. తెలుగులో పెద్దరికం, అనగనగాఒక రోజు వంటి చిత్రాల్లోనూ నటించారు.
విజయశాంతి నటించిన అడవి చుక్క, నాగ ప్రతిష్ట, తెలుగోడు సినిమాలు ఆయనకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాలేయ సంబంధ వ్యాధి కారణంగా 55 ఏళ్ల వయస్సుకే 2011లో ఆయన కన్నుమూశారు. వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి నరకం అనుభవించారు. గుర్తుపట్టేలేనంత సన్నగా అయిపోయారు. చాలాకాలం పాటు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కుని 2011, ఏప్రిల్ 14న కన్నుమూశారు.