వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి ద్వార సర్వదర్శనం టికెట్ల కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10 నుంచి మూడు రోజులకు సంబంధించి మొత్తం 1.20 టికెట్లను ఇస్తామని చెప్పారు. గురువారం ఉదయం 5 నుంచి టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. అయితే బైరాగిపట్టేడలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందనుకున్న భక్తులు బుధవారం ఉదయం నుంచే అక్కడికి చేరుకోవడం మొదలు పెట్టారు. రాత్రికి భక్తులతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి రాత్రి 8.20 కి క్యూలైన్లలోకి అనుమతించారు.
మెయిన్ గేటు వద్ద ముందుగా వెళ్తున్న భక్తుల మధ్య తోపులాట జరిగింది. దాంతో చాలా మంది కిందపడిపోయారు. అంతే ఒక్కసారిగా ఘోరం జరిగిపోయింది. దీంతో చాలా సేపు భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకుండా నిలిపివేసి సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో ప్రాణనష్టం తగ్గింది. గాయపడిన భక్తులను పోలీసులే అంబులెన్స్ లో చేర్చి హుటాహుటిన స్విమ్స్, రుయాకు తరలించారు. తిరుపతిలోని పలు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రోడ్ల పై బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. బైరాగిపట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించడమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ రమణకుమార్ కు రహదారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తుంది. అయితే ఏ ప్రమాదం జరగదన్న ధీమాతో ఏర్పాటు చేయకపోగా..భక్తులను పార్కులోఉంచి ఒకేసారి అనుమతించడంతో ఈ ప్రాణ నష్టం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం నంచి కేంద్రాలను టీటీడీ, పోలీసులు పరిశీలించి ఏర్పాట్ల పై చర్చించారు. చివరకు అమలుచేయడంలో ఘోరంగా విఫలమైనట్లు భక్తులు అంటున్నారు. అసలు ఏ సమయానికి ఏం జరిగింది.. ఉదయం 10 గంటలు: రామానాయుడు ఉన్నత పాఠశాల కౌంటర్ వద్దకు పెరిగిన భక్తుల తాకిడి.
శ్రీపద్మావతి పార్కులోకి అనుమతి. మధ్యాహ్నం 2 గంటలకు భక్తులతో నిండిన పార్కు.అదుపు చేసేందుకు భారీగా పార్కు వద్దకు చేరిన పోలీసులు. రాత్రి 7 గంటలకు పూర్తిగా పార్కు నిండిపోవడంతో ఎటూ కదల్లేని పరిస్థితులు. భక్తులకు తాగునీరు అందించిన పోలీసులు. రాత్రి 8.20 గంటలు భారీగా పెరిగిన రద్దీ. పార్కు నుంచి టికెట్ల జారీ కౌంటర్ లోకి అనుమతి. ఈక్రమంలో భక్తుల మధ్య తోపులాట. పలువురు కిందపడగా.. వారి పై నుంచి భక్తులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం చోటు చేసుకుంది.
రాత్రి 8.40 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్లు, రుయా, స్విమ్స్‌కు గాయపడిన భక్తుల తరలింపు. రాత్రి 9.27 గంటలకు టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం సంఘటన స్థలానికి చేరుకుని పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 9.30 గంటలకు పార్కులోని భక్తులందరినీ క్యూ పద్దతిలో కౌంటర్ లోని క్యూలైన్లలోకి వదిలారు.