తీర్థయాత్రల సమయంలో కరెన్సీ వినియోగాన్ని నియంత్రించేందుకు గాను భారతీయ రిజర్వ్ బ్యాంక్ హజ్ నోట్ల జారీ ప్రక్రియను మొదలుపెట్టింది. అందులో భాగంగానే 1950లలో RBI ఓ నోటును విడుదల చేసింది. ఈ ప్రత్యేకమైన నోటుకు HA 078400 అనే సీరియల్ నెంబర్ ఇచ్చింది. ఇది హజ్ నోట్స్ అని పిలువబడే ఒక విభిన్న శ్రేణికి చెందిన నోటు. అప్పట్లో భారతీయ కరెన్సీని ఉపయోగించి బంగారాన్ని అక్రమంగా కొనుగోలు చేయడాన్ని నిరోధించడంలో భాగంగా ఈ నోట్లను విడుదల చేసేవారు.
అయితే చారిత్రాత్మక వస్తువులు, క్రికెటర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వస్తువులను తరచూ వేలం వేస్తుంటారు. ఇక అవి ఆక్షన్‌లో లక్షలు, కోట్లకు అమ్ముడవుతుంటాయి. ఇక ఇప్పుడు ఈ భారత కరెన్సీకి చెందిన ఓ రూ. 100 నోటు వేలంలో ఏకంగా ఎన్ని లక్షలకు అమ్ముడైందో తెలిస్తే షాక్ కావడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే.. లండన్‌లో ఇటీవల జరిగిన వేలంలో భారత కరెన్సీకి చెందిన 74 ఏళ్ల నాటి రూ. 100 నోటు సుమారు రూ. 56 లక్షలకు అమ్ముడైంది. దానిని హజ్ నోట్ అని పిలుస్తారు.
1950లో హజ్ యాత్ర కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయ యాత్రికులకు ఈ ప్రత్యేక కరెన్సీ నోటును విడుదల చేసింది ఆర్బీఐ. బంగారం అక్రమ కొనుగోలును నిరోధించేందుకు ఈ హజ్ నోట్‌ను విడుదల చేసింది. ఈ నోట్లు సాధారణ భారతీయ నోట్ల కంటే భిన్నమైన రంగులో ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలలో ఈ నోట్లు చట్టబద్ధమైనప్పటికీ, ఈ నోట్లు భారతదేశంలో చెల్లవు. 1970లో ఆర్‌బీఐ ఈ హజ్ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది.
ఈ ప్రత్యేక నోటు ఇప్పుడు వేలం ప్రక్రియలో రూ. 56,49,650కు అమ్ముడైంది. 6.90 లక్షలకు అమ్ముడైన అరుదైన రూ.10 నోటు.. అటు ఈ వేలంలో రెండు అరుదైన రూ.10 నోట్లు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఒకటి రూ.6.90 లక్షలకు అమ్ముడుపోగా, మరో నోటు రూ.5.80 లక్షలకు అమ్ముడైంది. ఈ రెండు నోట్లకు చారిత్రక ప్రాధాన్యత ఉండటం విశేషం.