తిరుమల లడ్డూ అంశం ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. ఇప్పుడు మరో ఆలయ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, అందులో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఇప్పటి వరకు తయారు చేసిన అరవణ ప్రసాదం డబ్బాలను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం ఉంది.
వీటిని గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉంచేశారు. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా అధిక మోతాదులో క్రిమిసంహారకాలు కలిసినట్టు ఆరోపణలు వచ్చాయి. అందువల్లనే అరవణ ప్రసాదం పంపిణీని నిలిపివేశారు. అయితే, ‘అరవణ’ను పెద్ద మొత్తంలో పారవేయడం అధికారులకు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. అటవీ ప్రాంతాల్లో పారవేసేందుకు అధికారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి టీడీబీ దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టెండర్లను ఆహ్వానించింది.
ఈ టెండర్‌ను కేరళకు చెందిన ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ (ఐసీఈఎస్) టెండర్లను దక్కించుకుందని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ డీహెచ్‌కి తెలిపారు. వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని తమ సదుపాయానికి తీసుకెళ్లిన తర్వాత ‘అరవణ’ను శాస్త్రీయంగా ఎరువుగా మార్చాలని వారు ప్రతిపాదించారు. తొలుత కేరళలోని కొట్టాయంలో ఉన్న తమ గూడెంకి తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళతారు. ‘అరవణ’ను శాస్త్రీయంగా పారవేసేలా టీడీబీ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
బియ్యం, బెల్లంతో చేసిన ‘అరవణ’ శబరిమల అయ్యప్ప ప్రధాన ప్రసాదం. అంతేకాకుండా శమరిమల పుణ్యక్షేత్రానికి ప్రధాన ఆదాయ వనరులలో అరవణ ప్రసాదం ఒకటి. గత ఏడాది ‘అరవణ’ విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు రూ. 147 కోట్లు. ఇది ఆలయ మొత్తం ఆదాయంలో 40 శాతం. కాగా రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేయడంపై ఐసీఈఎస్ గతంలో వార్తల్లో నిలిచింది.