రోజా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారామె. ఇదిలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అన్షు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రోజా కూతురు అన్షు మాలిక ఒక అరుదైన గౌరవాన్ని అందుకుంది. నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో అన్షు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు ను అందుకుంది.
అది కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఆమె అందుకోవడం గమనార్హం. ఈ విషయం తెలియడంతో అభిమానులు అన్షును అభినందిస్తున్నారు. అన్షుకు ఇలాంటి అవార్డులు కొత్తేమి కాదు. గతంలో కూడా ఆమె ఇలాంటి అవార్డులను అందుకుంది. రోజా కూతురు అన్షు.. అచ్చు రోజాకు జిరాక్స్. కుర్ర వయస్సులో రోజా ఎలా ఉందో అలానే ఉంది. అమ్మ అందాన్ని పుణికిపుచ్చుకోవడంతో.. అందరు అన్షు టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అందుకున్నారు.
కానీ, అన్షు మాత్రం సినిమాల మీద ఆసక్తి కనపర్చడం లేదు. అన్షు కాకుండా రోజా కొడుకు ఇండస్ట్రీ మీద ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ విషయాన్నీ రోజా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. “నా కొడుకు కౌశిక్. ఆరడుగుల హైట్ ఉంటాడు. వయస్సు 18 ఏళ్లు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. చదువు కంటే ఎక్కువగా వాడికి సినిమాలు అంటే ఆసక్తి. అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి నేను సినిమాల్లో నటిస్తాను అని చెప్తాడు. అంతేకాకుండా డైరెక్షన్ లో కూడా ఇంట్రెస్ట్ అంటారు.
వాడికి ఆ రెండు రంగాల్లో ఎందులో స్థిరపడాలని ఉంటే అందులోనే ఎంకరేజ్ చేస్తాం. దేవుడి ఆశీస్సులు ఉంటే ఇండస్ట్రీలోకి వస్తాడు” అని చెప్పుకొచ్చింది. మరి రోజా వారసులు ఏ కెరీర్ ను ఎంచుకుంటారో చూడాలి.