రోసన్నా పాన్సినో ఒక ప్రసిద్ధ బేకర్, నటి, ఆమె తన స్వీయ-శీర్షిక యూ ట్యూబ్ ఛానెల్ కోసం ఈ తరంలో ప్రసిద్ధి చెందింది, ఈమె అన్యదేశంగా కనిపించే కేకుల నుండి ఉల్లాసకరమైన సవాళ్ల వరకు ప్రతిదానితో అబ్బురపరుస్తుంది. అయితే మహిళలు గంజాయి కాల్చడం కొత్తేమీ కాదు. వింత మరీ కాదు. కానీ, తన తండ్రి మరణిస్తే శవాన్ని కాల్చగా మిగిలిన బూడిదపై గంజాయి మొక్కను పెంచి, ఆ గంజాయి ఆకులతో సిగరెట్టు చేసుకుని తాగానని చెప్పడమే ఇక్కడ అందరినీ విస్తుపోయేలా చేసింది.
అవును ఇదంతా, అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ రోసన్నా పాన్సినో తన మాటల్లోనే చెప్పిన వాస్తవాలు.. ఆమె తన రాడిక్యులస్ పోడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్ సందర్భంగా దివంగత తండ్రికి ప్రత్యేక నివాళులర్పించింది. 39 ఏళ్ల ఇంటర్నెట్ స్టార్, 14.6 మిలియన్లకు పైగా యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లతో దూసుకుపోతున్న యూట్యూబర్ రోసన్నా పాన్సినో తన తండ్రి చితభస్మం ఉపయోగించి పెరిగిన గంజాయితో చేసిన సిగరెట్‌ను కాల్చి తన తండ్రికి నివాళి అర్పించానని చెప్పారు.
పోడ్‌కాస్ట్ ఎపిసోడ్, “స్మోకింగ్ మై డెడ్ డాడ్” పేరుతో నవంబర్ 17న ఈ వీడియో ప్రసారమైంది. లుకేమియాతో ఆరేళ్ల పోరాటం తర్వాత ఐదేళ్ల క్రితం తన తండ్రి చనిపోయాడని చెప్పింది. చనిపోయే ముందు తన తండ్రి అసాధారణమైన కోరిక ఇదేనని పాన్సినో పేర్కొంది. అతను తన బూడిదను గంజాయి మొక్కకు ఉపయోగించి పెంచమని కోరినట్టుగా చెప్పింది.
తన తండ్రి కోరిక మేరకు తను ఇలా చేశానని రోసన్నా వెల్లడించింది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తీవ్ర దుమారం రేపింది.