గతంలో ఇద్దరూ మేజర్లు అయితే చాలని భావించి వారికి రూమ్ ఇచ్చేది. ఏమైందో ఏమోకానీ ఇప్పుడు దీనికి చెక్ పెట్టాలని ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ నిర్ణయించారు. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్ ఇచ్చేది లేదని బుకింగ్ సదుపాయాన్ని ఎత్తేశారు. బుకింగ్ సమయంలోనే వివాహానికి సంబంధించి తగిన ఆధారాన్ని చూపించాలని స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధనలు చాలా చోట్లు ఉల్లంఘనలకు గురయ్యాయి. తక్కువ వయసు ఉన్నవారికి కూడా గదులు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు పెరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఓయో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
ఇకపై పెళ్లికాని జంటలకు ఓయో రూమ్స్ కేటాయించరు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఏదైనా జంట హోటల్ గదిని బుక్ చేసుకుంటే, చెక్-ఇన్ సమయంలో తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాలి. అప్పుడే వారికి గది ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అయితే ఓ జంట పెళ్లి చేసుకోకుండా ఓయో హోటల్ బుక్ చేసుకొని, చెకింగ్ టైమ్‌లో దొరికితే ఏం జరుగుతుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కొత్త నిబంధనల ప్రకారం పెళ్లికాని జంటలకు హోటల్ గదులు ఇవ్వడం నిషేధమని ఓయో యాజమాన్యం పేర్కొంది. ఎవరైనా అలాంటి జంట వస్తే గది ఇవ్వకుండా సిబ్బంది తిరస్కరించాలి.
అయితే పెళ్లికాని జంటలు ఓయోలో పట్టుబడితే, శిక్ష లేదా జరిమానా విధించే నిబంధన లేదు. చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. పెళ్లికాని జంటలకు ఓయో రూమ్స్ నిరాకరించే నియమం ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా వర్తించరు. ముందు ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దేశంలోని ఇతర నగరాల్లో ఇలాంటి రూల్ లేదు. అయితే హోటళ్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని నగరాలకు ఈ విధానాన్ని అప్లై చేయాలని ఓయో భావిస్తోంది. కొన్ని నగరాల్లోని హోటళ్లలో పెళ్లికాని జంటలకు గదులు అద్దెకు ఇవ్వడాన్ని అనుమతించకూడదని కొన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయో వెల్లడించింది.
దేశంలో ఏ చట్టం కూడా పెళ్లికాని జంట హోటల్‌లో ఉండేందుకు నిరాకరించదు. అయితే ఒక జంటను చెక్-ఇన్ చేయడం హోటల్ యజమానులు/ నిర్వాహకులపై ఆధారపడి ఉంటుంది. అయితే చెక్-ఇన్ చేయడానికి అనుమతించాలంటే 18 సంవత్సరాలు నిండాలి. ఇద్దరూ వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ చూపించాలి. పెళ్లి కానివారు లేదా హోటల్ ఉన్న ప్రదేశంలో అదే నగరానికి చెందిన వారికి గది ఇవ్వకుండా కూడా హోటళ్లను నిషేధించే చట్టం భారతదేశంలో లేదు.
‘కుటుంబ సభ్యులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, ఒంటరిగా పర్యటనలు చేసేవారికి మంచి ఆతిథ్యం అందించేందుకు ఓయో కట్టుబడి ఉంది. వ్యక్తుల స్వేచ్ఛను మేం కచ్చితంగా గౌరవిస్తాం. అదే సమయంలో చట్టాలను అమలు చేయడం మా బాధ్యత’ అని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవాస్ శర్మ ఓ ప్రకటనలో చెప్పారు.