పెళ్లి చూపుల నుంచి తాళి కట్టేంత వరకు ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు ఉంటాయి. అంతేకాదు ఒక కుటుంబంలో కళ్యాణం జరగాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు చూడటానికి ముందు కొన్ని విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అయితే గోత్ర వ్యవస్థ అనేది వంశ స్వచ్ఛతను కాపాడడానికి ప్రాచీన కాలంలో రూపుదిద్దుకున్న నియమం. పురాణాల ప్రకారం, ప్రతి గోత్రం ఒక గొప్ప ఋషితో ముడిపడి ఉంటుంది. అదే గోత్రంలో వివాహం చేయకూడదని నిబంధన ఉంది, ఎందుకంటే అటువంటి వివాహం సోదరభావానికి విరుద్ధంగా ఉంటుంది.
ఈ విధానంలో వంశ ప్రతిష్టను కాపాడటమే కాకుండా, కుటుంబ సంబంధాలను మెరుగుపరచడంలో కూడా దృష్టి పెట్టారు. శాస్త్రీయ ప్రామాణికత..జన్యు శాస్త్రపరంగా ఒకే గోత్రానికి చెందిన వారితో వివాహం చేయడం వల్ల సంతానంలో జన్యు సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, భిన్నమైన జన్యువులతో ఉన్న వ్యక్తుల మధ్య వివాహం సంతానం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విధానం జన్యు వైవిధ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. సామాజిక కోణం..గోత్ర వ్యవస్థ సామాజిక సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషించింది.
ఒకే సమాజంలోని వ్యక్తులు వివాహం చేసుకోవడం ద్వారా కులతత్వం, వర్గ వ్యవస్థ వంటి అంశాలను కొనసాగించడంలో ఇది ఉపయోగపడింది. నేటి సమాజంలో గోత్ర వ్యవస్థ..ఈ రోజుల్లో గోత్ర వ్యవస్థకు పూర్వంలా ప్రాధాన్యం లేకపోయినా, ఇది ఇంకా సాంప్రదాయ, మతపరమైన సంప్రదాయంగా కొనసాగుతోంది. కొందరు దీనిని పాతకాలపు ఆచారంగా భావిస్తే, మరికొందరు దీనిని తమ కుటుంబ ఆచారాలకు ప్రధానమైన అంశంగా గుర్తిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో గోత్ర వ్యాప్తి నియమాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మనుస్మృతిలో తండ్రి వైపు ఆరు తరాలు, తల్లి వైపు ఐదు తరాల వరకూ వివాహం జరగకూడదని చెప్పబడింది. ఇది కుటుంబ సంబంధాలను కాపాడటంలో కీలకంగా ఉంది.