పెట్రోల్, డీజిల్‌ను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రజలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో రానున్న కొద్దిరోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పు కనిపించవచ్చని, ఈ ధరలు బాగా దిగొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
అయితే రూ.20 లక్షల వరకు మాత్రమే ఆదాయం ఉన్నవారిపై పన్ను రేట్లను తగ్గించాలని సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. ఫలితంగా వారి వద్ద సేవింగ్స్ పెరుగుతాయని తెలిపింది. ఇది కొనుగోళ్లకు దారితీస్తుందని వివరించింది. దీంతో వినిమయం పెరిగి వృద్ధిరేటు బాగుంటుందని తెలిపింది. ప్రభుత్వానికి పన్ను రాబడులు కూడా పెరుగుతాయని వివరించింది.
వ్యక్తులపై ఉన్న గరిష్ఠ మార్జినల్ ట్యాక్స్ రేట్ 42.74 శాతం కాగా.. స్డాండర్డ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ 25.17 శాతంగా ఉన్నట్లు గుర్తుచేసింది. ఈ భారీ తేడాను తగ్గించాలని సీఐఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం పేద, మధ్యాదాయ వర్గాలపై తీవ్ర నెగిటివ్ ప్రభావం చూపుతున్నట్లు సీఐఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
పెట్రోల్ ధరలో 21 శాతం, డీజిల్ ధరలో 18 శాతం వాటా ఈ సుంకానిదే. 2022 మే నుంచి దీన్ని సవరించలేదు. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు 40 శాతం తగ్గాయని సీఐఐ వెల్లడించింది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఇన్‌ఫ్లేషన్ దిగొస్తుందని, ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించింది.