భారత్ లో కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.. HMPV వైరస్ కేసులతో దేశంలో మళ్లీ లాక్ డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా చాలా మంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ కేసులు పెరుగుతున్న తీరుపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో Lockdown టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. అయితే చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమో -HMPV వైరస్..అనుకున్న దాని కంటే వేగంగానే ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఇప్పటిదాకా నాలుగు HMPV వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
ఇందులో రెండు కర్ణాటక రాజధాని బెంగళూరులో కాగా.. మరో కేసును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుర్తించారు. ఇక బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో కేసును గుర్తించారు. ఐదు నెలల చిన్నారికి.. HMPV పాటిజివ్‌గా తేలింది. ఈ విషయాలను ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరులో 3, 8 నెలల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్‌గా తేలగా.. అహ్మదాబాద్‌లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని ICMR చెబుతోంది.
పలువురు చిన్నారులకు టెస్ట్ చేసిన సమయంలో వైరస్ బయటపడిందన్న ICMR పేర్కొంది. మరోవైపు కరోనా వేరియంట్లలాగే HMPV వైరస్ ఉపిరి తిత్తులను టార్గెట్ చేస్తుంది. జలుబు, దగ్గు, శ్లేష్మం, జ్వరం…ప్రస్తుతం ప్రపంచం కరోనాతో ఎఫెక్టయి ఊపిరితిత్తులు పూర్తిగా బలహీనపడ్డాయి. చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశమైంది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి భారత్‌లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని సమావేశంలో నిపుణులు తెలిపారు. చైనాలో జరగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
WHO కూడా చైనాలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. చలికాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ ఫ్లూయెంజా, RSV, HMPV వంటి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ తెలిపింది. భారత్‌లో HMPV వైరస్ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల RSI, HMPV వంటి పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక వేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.