HMPV వైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా అధికారులు ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఇవన్నీ పూర్తిగా ఆధారరహితమని, ప్రజల్ని అనవసరంగా భయాందోళనకి గురి చేస్తున్నాయని తెలిపింది. అయితే ఐదేళ్ల క్రితం ఎక్కడో చైనాలో పుట్టిన కోవిడ్-19 యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. డ్రాగన్ కంట్రీ నిర్లక్ష్యానికి ప్రపంచం మొత్తం ప్రభావితం అయింది. ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా లక్షల మందిని బలితీసుకుంది. ఈ క్రమంలోనే చైనాలో వెలుగులోకి వచ్చిన మరో వైరస్ ఇప్పుడు మిగతా దేశాలను వెంటాడుతోంది.
ఇప్పటికే భారత్‌లోనూ వాలిపోయిన వైరస్..చిన్నారులు, వృద్ధులను వేగంగా ఎటాక్ చేస్తోంది. దాంతో భారత వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు వేగవంతం చేసింది. అయితే, ఈ HMPV వైరస్ కరోనా మాదిరిగానే జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉండే ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, కిడ్నీలపై HMPV వైరస్ దాడిచేస్తుందని తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ నిపుణుల బృందం తాజాగా వెల్లడించింది. అయితే, దీనిపై మరింత లోతైన పరిశోధన జరుగుతున్నట్టుగా చెప్పారు. వైరస్ ఊపిరితిత్తులకు సోకుతుందని, అలాగే ఈ వైరస్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు.
ఈ వైరస్ ప్రధానంగా పిల్లలు, వృద్ధులను ప్రభావితం చేస్తుంది. దీని సాధారణ లక్షణాలు జ్వరం, అలసట, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా గుర్తించారు. వైరస్‌ను 2001లో శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించినప్పటికీ, ఇది 1970లలో వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. చైనాలో HMPV వైరస్ కారణంగా చాలా మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.