తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయవ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే ఏపీకి బిగ్ రెయిన్ అలెర్ట్. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్ర, శనివారాల్లో పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు చేరువలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాకు భారీ వర్షాలు ఉంటాయంటోంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని,గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. సెప్టెంబరులో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొద్దిరోజులుగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంగా.. మరికొన్ని జిల్లాల్లోల మాత్రం ఎండలు, ఉక్కపోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని వెదర్ డిపార్ట్‌మెంట్ సూచించింది.