కొంతమంది ప్రతిరోజు మేల్కొన్న వెంటనే తాతయ్య, నానమ్మ లేదంటే తల్లిదండ్రుల పాదాలకు మొక్కుతారు. రాత్రి పడుకునే ముందు కూడా ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల గొప్ప శక్తి లభిస్తుందని, గొప్ప అనుభూతి కలుగుతుందని మహాభారతంలో కూడా చెప్పబడింది. పెద్దవారి పాదాలను తాకడం వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తాం. అయితే భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందు సంస్కృతిలో ఒకటి కుటుంబ పెద్దలతో పాటు ఎవరైనా పెద్దలు కనిపిస్తే వంగి వారి కాళ్ళకు చేతులతో నమస్కరించడం. ఇది చేతులతో పెట్టె నమస్కారం.. మాత్రమే పెద్దలకు, గురువులకు దైవ సమానులు అని భావించేవారి కాళ్లకు దణ్ణం పెట్టడం సనాతన హిందూమతంలోని సంప్రదాయాలు, విశ్వాసాలకు చిహ్నం.
హిందూమతంతో ముడిపడి ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు ప్రత్యేక కోణాన్ని జోడిస్తాయి. పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేయడానికి చేతులు, కాళ్ళతో నమస్కరించే ఆచారం ఉంది. హిందూ మతంలో దేవతలకు నమస్కరిస్తే ఆశీస్సులు లభిస్తాయని ఎలా విశ్వసిస్తారో.. అదే విధంగా భగవంతుని స్థానంలో తల్లిదండ్రులను ఉంచి గౌరవిస్తారు. పెద్దలకు , తల్లిదండ్రులకు, గురువుల పాదాలకు చేతులతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా చేయడం శుభప్రదం అని నమ్మకం. రోజూ తల్లిదండ్రులకు నమస్కరించడం వలన చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి.
ఇలా చేయడం మతపరమైన సంప్రదాయమే కాదు ఇంటి పెద్దలకు నమస్కరించడం వెనుక శాస్త్రీయ కారణాలు, ప్రయోజనాలు ఉన్నాయి. హిందూ మతం ప్రకారం పెద్దల ఆశీర్వాదం జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని, సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు. ఇలా పెద్దలు తమ పాదాలకు నమస్కరించిన వారికి సాధారణంగా ఆశీర్వాదం ఇస్తూ.. సుఖ సంతోషాలతో ఉండండి.. ఆర్ధికంగా లోటు లేకుండా జీవించండి అంటూ దీవిస్తారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత నూతన వధూవరులు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పెద్దలు దీర్ఘ సుమంగళీభవ, సంతాన ప్రాప్తిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తారు.
ఇంట్లోని పెద్దలు పిల్లలు సుఖ సంతోషాలు, సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తారు. అయితే దీర్ఘ సుమంగళీభవ, సంతాన ప్రాప్తిరస్తు వంటి దీవెనలు స్త్రీలకు లేదా వధువులకు మాత్రమే ఎందుకు ఇస్తారు? అంటే కోడలు పెళ్లయ్యి.. అత్తవారింటిలో అడుగు పెట్టిన అనంతరం ఆ వంశాభివృద్ధి చేయాల్సిన భాద్యత ఆ ఇంటి కోడలకు ఉంది కనుక సంతానం కలగాలంటూ పెళ్లికూతురు త్వరలో తల్లి కావాలని పెద్దలు వధువుకు ఈ ఆశీర్వాదాలు ఇస్తారు.ఇలా పెద్దల ఆశీర్వాద బలంతో నవ దంపతులు సంతోషంగా, సుఖ శాంతులతో పిల్లా పాపాలతో నిండు నూరేళ్ళు జీవిస్తారని హిందూ సనాతన ధర్మంలో నమ్మకం.