దసరా నాడు దుర్గాదేవిని మనసారా వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మీ కోరికలే కాదు, మీ స్నేహితులు, బంధువుల కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేయండి. అయితే దసరా ఉత్సవాలు దక్షిణభారతదేశంలోనే ఒంగోలులో ప్రత్యేకంగా జరుగుతాయి. నవమి రోజున నగరంలోని ఆరు దేవస్థానాల నుంచి అమ్మవారి కళారాలను నగరంలో ఊరేగించటం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అమ్మవార్ల కళారాల ఊరేగింపు కమనీయంగా సాగింది. ఎరుపు రంగులో అంకమ్మపాలెంలోని కాళికమ్మ, పసుపువర్ణంలో బాలాజీరావుపేట కనకదుర్గమ్మ, తెలుపువర్ణంలో బీవీఎస్ హాలు దగ్గరున్న నరసింహస్వామి కళారాలు భక్తుల జయజయధ్వానాలు, నృత్యాల నడుమ బయల్దేరి నగరంలోని వివిధ ప్రధాన రహదారుల ద్వారా కొనసాగాయి.
మైసూరు, కలకత్తాల తరువాత ఒంగోలు నగరంలో మాత్రమే ఈ కళారాల ప్రదర్శన జరగుతోంది… 4 వందల ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒంగోలు నగరంలో మొత్తం ఆరు కళారాల ఊరేగింపు జరుగుతుంది. దుర్గాష్టమి నాడు బాలాజీరావు పేట కనకదుర్గ, అంకమ్మపాలెం కాళికాదేవి, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు నరసింహస్వామి- అమ్మవార్ల కళారాలు ఊరేగిస్తారు. మహర్నవమి రోజున గంటపాలెం పార్వతమ్మ, కేశవస్వామిపేట విజయదుర్గాదేవి, బివిఎస్ హాలు సెంటరులోని బాలాత్రిపుర సుందరి కళారాల ఊరేగింపు జరుగుతుంది.
దుష్ట సంహారంలో నర సింహ స్వామి అమ్మవారికి తోడుంటాడన్నది భక్తుల భావన. అన్నీ ఒకచోట.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభ మయ్యే కళారాల వెంట స్థానికులు కేరింతలు కొడుతూ బయల్దేరతారు. వాద్యకారులు భీకర శబ్దాలతో హోరెత్తి స్తుంటారు. నృత్యాలు చేసేవారు, కాళికాంబ వేషధారణతో…. కోలాహలమంతా ఇక్కడే కొలువుంటుంది. ఇలా ఊరేగింపుగా వస్తున్న అమ్మవారిని దర్శించి, కోబ్బరికాయలు, కర్పూర నీరాజనాలు సమర్పించడం తమ అదృష్టమని భావిస్తారు మహిళలు. అమ్మవారి రాక కోసం రాత్రంతా మేల్కొని మరీ ఎదురు చూస్తారు… మరుసటి రోజు ఉదయానికి అన్ని కళారాలు ట్రంక్ రోడ్డులోని మస్తాన్ దర్గా వద్దకు చేరుకుంటాయి.
టపాసులు కాలుస్తూ, ఈలలు వేస్తూ పరస్పరం స్వాగతించుకుంటారు భక్తులు. ఆ వైభవాన్ని చూడ్డానికి జనం వేలాదిగా గుమికూడతారు. దీనివల్ల ఏడాది పాటు దుష్టశక్తులు నగరానికి రాకుండా ఉంటాయనేది భక్తుల నమ్మకంగా ఉంటుందని ఆలయ పూజారులు, నిర్వాహకులు చెబుతున్నారు. దసరా ఉత్సవాల్లో ఒంగోలు నగరానికే హైలెట్‌గా నిలిచే కళారాల ఉత్సవాలు 4 వందల ఏళ్ళుగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతారు… అయితే అంతకు ముందు నుంచే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని భావిస్తారు… అప్పటి నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఓ ప్రత్యేకమైన సాంప్రదాయంగా దసరా పండుగ సంబరాల్లో కళారాలను ప్రదర్శించడం గొప్పవిషయమే.