షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ గత కొంతకాలంగా విద్యార్ధులు భారీ ఆందోళన చేపట్టారు. ఆదివారం చెలరేగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోయారు. హింసలో ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాంతిభద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్‌లైన్ విధించింది. అయితే ఆరోజు ఉదయం ప్రధాని రక్షణ, పోలీసు ప్రధానాధికారులను తన నివాసానికి పిలిపించుకుని ఒక మీటింగ్ పెట్టింది. క్షణక్షణానికి మరణాలు పెరుగుతుండడంతో ఆందోళన చెందిన ఆమె ముఖ్య సలహాదారులు, సైన్యానికి అధికారాన్ని అప్పగించమని విజ్ఞప్తి చేసారు. అప్పటికే దాదాపు 300మందిఆందోళనల్లో మరణించారు.
కానీ హసీనా ససేమిరా దానికి ఒప్పుకోకపోగా, అప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూని మరింత బలోపేతంగా మార్చాలని అధికారులకు చెప్పారు. అప్పటికే వీధుల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తూ, ఢాకాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా గుమిగూడారు. ప్రధాని తన మీటింగ్‌లో ఉన్నతాధికారులనుద్దేశించి, పరిస్థితిని వారెందుకు నియంత్రించలేకపోతున్నారని నిలదీసారు. పోలీసు వాహనాల పైకెక్కి ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టివీలో వారికి చూపిస్తూ, భద్రతాబలగాలు వారిపట్ల కఠినంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నాయని ప్రశ్నించారు. ఒకానొక స్థితిలో, తాను వారిని నమ్మి ఈ హోదాలలో కూర్చోబెట్టినట్లు గుర్తుచేస్తూ, అటువంటిది ఈ సమయంలో వారి నిష్క్రియాపరత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇదే మీటింగ్‌లో పోలీసుల పనితీరును మెచ్చుకున్న హసీనాతో పోలీస్ చీఫ్, పరిస్థితిని తాము ఎంతో సేపు అదుపు చేయలేమని చెప్పినట్లు సమాచారం. రక్షణ యంత్రాంగం ప్రధానికి యదార్థ పరిస్థితిని వివరిస్తూ, మరింత బలప్రయోగం సమర్థనీయం కాదని తెలిపినా, ఆమె వినలేదు. అప్పుడు వారు హసీనా సోదరి రెహనాను వేరే గదిలో కలుసుకుని, ప్రధానిని పదవి నుండి దిగిపోవాల్సిందిగా నచ్చజెప్పాలని కోరారు. రెహనా సోదరితో మాట్లాడినా ఉపయోగం లేకపోయింది. ఇక అప్పుడు అమెరికాలో ఉంటున్న హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ రంగంలోకి దిగాడు. తన తల్లితో మాట్లాడి రాజీనామాకు ఒప్పించాడు. ఒక ఇంగ్లీష్ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, “ఈ ఉదయం అమ్మతో మాట్లాడాను.
బంగ్లాదేశ్ పరిస్థితి చాలా అరాచకంగా ఉంది. అమ్మ మాత్రం ఉత్సాహంగానే ఉంది కానీ, చాల నిరాశ చెందింది. బంగ్లాదేశ్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేదే ఆమె కల. గత 15ఏళ్లుగా తీవ్రవాదులపై, తీవ్రవాదంపై పోరాడుతోంది. అయినా, ఇప్పుడు దేశం ప్రతిపక్షం, తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది” అని అన్నారు. సమయం అంతకంతకూ మించిపోతోంది. ఆందోళనకారులు లెక్కకుమించి పెరిగిపోతుండం, ఏ క్షణంలోనైనా వారు ప్రధాని నివాసం, గణభబన్ను ముట్టడించవచ్చనే నిఘావర్గాల సమాచారంతో అధికారులు షేక్ హసీనాకు తన సామాగ్రి ప్యాక్ చేసుకోవడానికి 45 నిమిషాల సమయం ఇచ్చారు.
ఆమె దేశ ప్రజలనుద్దేశించి ఒక ఆఖరి సందేశం రికార్డ్ చేద్దామనుకున్నారు కానీ, సమయం చాల్లేదు. వెంటనే తన సోదరి రెహనాతో కలిసి అధికార నివాసం వదలిపెట్టారు. దార్లో కొన్ని నిమిషాలు అధ్యక్షుడి అధికార నివాసం బంగభబన్ లో ఆగి, రాజీనామా తతంగం పూర్తి చేసింది. అనంతరం 76 ఏళ్ల పదవీచ్యుత ప్రధాని మధ్యాహ్నం 2.30 గంటలకు తన 15ఏళ్ల సుదీర్ఘ పదవీకాలానికి తెరదించి, సైనిక విమానంలో దేశం విడిచి వెళ్లింది. తన తండ్రి, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యసమర యోధుడు, బంగబంధుగా ముద్దుగా పిలుచుకునే షేక్ ముజిబుర్ రహ్మాన్ విముక్తి పోరాటం చేసిన యాభై ఏళ్ల తర్వాత , ఆయన విగ్రహాలను ఒకపక్క అల్లరిమూకలు ధ్వంసం చేస్తుంటే, షేక్ హసీనా మరోపక్కనుండి దేశం విడిచి పారిపోవాల్సివచ్చింది.