నేటితరం అమ్మాయిల్లో కొందరి ఫీలింగ్స్ తో ఈ కథ ఉండనుందని తాజాగా వదిలిన టీజర్ స్పష్టం చేస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు వెట్రి మారన్ దర్శకుడిగా తెలుసు. కానీ ఆయనలో ఒక నిర్మాత కూడా ఉన్నాడు. ధనుష్, త్రిష జంటగా నటించిన ‘ధర్మ యోగి’ (తమిళంలో ‘కోడి’)తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న ‘భైరవం’ తమిళ ఒరిజినల్ ‘గరుడన్’ ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే.
వెట్రి మారన్ ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ సినిమా ‘బ్యాడ్ గర్ల్’. ‘బ్యాడ్ గర్ల్’ టీజర్ విడుదల చేశారు. అది చూస్తే… వెట్రి మారన్ నుంచి ఇటువంటి సినిమానా? అని ఆడియన్స్ ఆశ్చర్యపోవడం ఖాయం. ఆల్రెడీ తమిళనాడు జనాలకు ఈ టీజర్ ఒక షాక్ ఇచ్చింది. ఈ తరహా కథలతో సినిమాలు రావడం తమిళంలో కొత్త కాదు. వెట్రి మారన్ నుంచి రావడం ఆశ్చర్యానికి కారణం. ‘బ్యాడ్ గర్ల్’ టీజర్ బట్టి ఈ సినిమా కథ ఏమిటి? అనేది ఒక అంచనాకు రావచ్చు. సంప్రదాయాలు పాటించే మధ్యతరగతి తమిళ కుటుంబంలో జన్మించిన అమ్మాయి, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని అనుకుంటుంది.
క్లాసులో ఒక అబ్బాయి ఆమెకు నచ్చుతాడు. అబ్బాయితో మాట్లాడుతుంది. ఒక రోజు ఎవరూ లేని క్లాస్ రూమ్ లో రొమాన్స్ చేస్తుండగా టీచర్ కంట పడుతుంది. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏమీ అనని తండ్రి ఆ విషయం తెలిసిన తర్వాత కొడతాడు. తనకు స్వేచ్ఛ కావాలని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సిగరెట్ కలుస్తుంది. మందు తాగుతుంది. పార్టీలకు, పబ్బులకు వెళుతుంది. నచ్చిన యువకుడితో రొమాన్స్ చేస్తుంది. తనకు నచ్చినట్టు ఉంటుంది. మరి, ఆ అమ్మాయి కథ చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి.