44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో వచ్చిన ఒక మోసపూరిత ప్రకటనను నమ్మి ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ ప్రకటన ప్రకారం.. ఒక మహిళ తనను తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన పురుషుడు కావాలని, అందుకు రూ. 25 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. పూర్తీ వివరాలోకి వెళ్తే సోషల్ మీడియాలో కనిపించిన ప్రకటనను నమ్మిన ఓ కాంట్రాక్టర్ భారీగా నష్టపోయాడు.
తనను తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన పురుషుడు కావాలని, అలా చేస్తే రూ. 25 లక్షల రూపాయలు ఇస్తానని ఒక ప్రకటన ఆన్‌లైన్‌లో కనిపించింది. ఆసక్తి ఉన్నవారు కాల్ చేయాలని ఒక ఫోన్ నెంబర్ కూడా ఆ ప్రకటనలో ఉంది. దీంతో ఆ మరాఠీ కాంట్రాక్టర్ వెంటనే ఫోన్ చేశాడు. ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి, అది ఒక ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ అని, ఆ సంస్థలో తాను అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు (bizarre scam).

మహిళతో కలిసే ముందు సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కంపెనీ ఐడెంటిటీ కార్డు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించాడు. రిజిస్ట్రేషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు ఫీజు, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజు వంటి అనేక రకాల చార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారు. ఎలాగైనా రూ.25 లక్షలు దక్కించుకోవాలనే అత్యాశతో ఆ కాంట్రాక్టర్ 100 కంటే ఎక్కువసార్లు చిన్న చిన్న మొత్తాలను ఆన్‌లైన్ ద్వారా పంపాడు. ఈ విధంగా మొత్తం రూ. 11 లక్షల వరకు డబ్బును బదిలీ చేశాడు.
ఇంత డబ్బు పంపినా తన పని పూర్తి కాకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది (online fraud). తాను పంపిన డబ్బు గురించి, రావాల్సిన రూ.25 లక్షల గురించి సదరు వ్యక్తిని బాధితుడు గట్టిగా నిలదీయడం ప్రారంభించాడు (fake job offer). దీంతో అవతలి వ్యక్తి ఇతడి నెంబర్లను బ్లాక్ చేశాడు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన కాంట్రాక్టర్ పుణెలోని బనేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసాలు బీహార్‌లోని నవాదా జిల్లా కేంద్రంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.
