డబ్బు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరినీ మనం కుబేరులు అంటూ ఉంటాం. ఇక మనకు కుబేరుడనగానే వేంకటేశ్వరస్వామికి ఆయన కల్యాణ సమయంలో అప్పిచ్చిన వాడిగానే తెలుసు.వెంకటేశ్వరుని అంతటివానికే అప్పిచ్చాడంటే ధనానికి తక్కువవాడు కాదని. డబ్బున్న మారాజుల్ని కుబేరులతో పోలుస్తాం. అయితే భృగు మహర్షి అనే మహా ముని త్రిమూర్తుల శక్తిని పరీక్షించాలనుకున్నాడు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. భృగు మహర్షి ముందుగా బ్రహ్మ, మహేశ్వరులను పరీక్షించాడు. ఆ తర్వాత విష్ణువును కలవడానికి వైకుంఠానికి వెళ్లాడు. విష్ణువు అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
అయితే ఆయన్ను లేపడానికి భృగు మహర్షి విష్ణువు ఛాతీ మీద కాలితో తన్నాడు. దీనికి విష్ణువు కోపగించుకోకుండా, మహర్షిని గౌరవంగా స్వాగతించాడు. విష్ణువులో ఈ వినయం చూసి మహర్షికి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన క్షమామూర్తి విష్ణువే త్రిమూర్తుల్లో గొప్పవాడు అని తెలుసుకున్నాడు. అమ్మవారికి కోపం:- లక్ష్మీ దేవి భృగు మహర్షి చేసిన పని చూసి కోప్పడింది. ఎల్లప్పుడూ పేదరికంలో జీవించాలని శపించింది. ఆ శాపం ప్రకారం, భృగు మహర్షి బ్రాహ్మణులను కలవలేకపోయాడు. దీనివల్ల ఆయన ఎలాంటి పూజల్లో పాల్గొనలేకపోయాడు. గతంలో మాదిరిగా సమాజంలో మర్యాదలు కూడా లభించలేదు. భృగు మహర్షి లక్ష్మీ దేవిని క్షమించమని వేడుకున్నాడు.
కానీ ఒక బ్రాహ్మణుడు విష్ణుమూర్తిని పూజించినప్పుడు మాత్రమే నీకు ఈ శాపం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పింది. ఆ తర్వాత లక్ష్మీ దేవి తన శాపం కారణంగా భృగు మహర్షి అనుభవిస్తున్న బాధను చూసి కనికరించింది. ఆయన బాధ తీర్చాలనుకుంది. అందుకే ఆమె భూలోకంలో పద్మావతి అమ్మవారిగా జన్మించింది. అదే సమయంలో విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా జన్మించారు. భూలోకంలో పుట్టిన అమ్మవారు శ్రీనివాసుడిని పెళ్లి చేసుకుంది. అప్పుడు బ్రాహ్మణులు ఈ పెళ్లిలో పాల్గొని స్వామిని పూజించారు. అలా బ్రాహ్మణులు విష్ణుమూర్తిని పూజించిన తర్వాత, భృగు మహర్షి శాపం పోయింది.
ఎంత అప్పు తీసుకున్నాడు?:- అయితే పద్మావతి అమ్మవారిని వేంకటేశ్వరస్వామి/ శ్రీనివాసుడు పెళ్లి చేసుకోవడానికి కుబేరుని దగ్గర నుంచి 1 కోటి 14 లక్షల బంగారు నాణేలను అప్పుగా తీసుకున్నాడు. శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని దేవ శిల్పి విశ్వకర్మను కోరాడు. కుబేరుని అప్పు తన భక్తుల సమర్పించే కానుకలతో తిరిగి చెల్లిస్తానని చెప్తాడు. ఇచ్చిన మాట ప్రకారమే స్వామివారు ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువులు విశ్వసిస్తారు.