సినీ, రాజకీయ రంగంలోని ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చెప్పిన జాతకాలు కూడా నిజం అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆయన సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. అయితే సంతానం లేనివారు ప్రముఖ కామాఖ్య ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తాంచాలనడం కామాఖ్య ఆలయ అర్చకుల ఆగ్రహానికి కారణమైంది.
ఈ కారణంగానే వేణు స్వామిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. తాజాగా మరోసారి తన పూజలతో వార్తల్లో నిలిచారీ ఫేమస్ ఆస్ట్రాలజర్. వటుక భైరవ పేరుతో పూజలు చేసిన ఆయన స్వామి వారికి మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత వాటన్నింటినీ హోమంలో వేసి ఆహుతి ఇచ్చారు. కాగా ఈ వటుక భైరవ పూజ గురించి పలు ఆసక్తకర విషయాలు చెప్పారు వేణుస్వామి.
ఈ పూజ ఎవరి పేరు మీద అయితే చేస్తామో వారికి కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, డబ్బు పరంగానూ విజయం సిద్ధిస్తుందన్నారు. అలాగే శత్రువుల పీడ కూడా విరగడవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వటుక భైరవ పూజా కార్యక్రమంలో తప్పకుండా స్వామి వారికి తప్పకుండా మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించాలని వేణు స్వామి తెలిపారు.
అయితే ఈ పూజా ఫలితం దక్కాలంటే పూజ చివరిలో నీటి మీద తేలియాడుతూ వటుక భైరవ పూజకు సంబంధించిన మంత్రాలను జపించాలన్నారు వేణు స్వామి. అందుకు తగ్గట్టుగానే పూజ అనంతరం ఫామ్ హౌస్ లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ నీటిపై తేలియాడుతూ వటుక భైరవ మంత్రాలను జపించారీ స్వామీజీ.
ఇందుకు సంబంధించిన ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు వేణుస్వామి. దీంతో అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మాంసం మద్యం దేవుడికి నైవేద్యంగా పెట్టడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
