ఇప్పుడు ఓయో హోటల్స్ కొత్త చెక్ ఇన్ రూల్స్ మారాయి. దీంతో వివాహం కాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జంటలు ఓయోకు వెళ్లాలంటే కొన్ని డాక్యుమెంట్లను తప్పక తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే మనదేశంలో పెళ్లికాని జంటలు హోటల్ లో కలిసి ఉండటంపై చాలామందిలో అపోహలు, అయోమయం నెలకొని ఉన్నాయి.
వాస్తవానికి భారతదేశంలో 18 ఏళ్లు నిండిన ఇద్దరు వ్యక్తులు (స్త్రీ, పురుషుడు) పరస్పర అంగీకారంతో ఒకే హోటల్ గదిలో బస చేయడం చట్టవిరుద్ధం కాదు. చట్టం మిమ్మల్ని నిరోధించదు. అయితే హోటళ్లు తమ సొంత నిబంధనలు, పాలసీలను కలిగి ఉండే హక్కును కలిగి ఉంటాయి. కొన్ని హోటళ్లు ఫ్యామిలీ ఓన్లీ పాలసీ కారణంగా పెళ్లికాని జంటలను అనుమతించకపోవచ్చు. కాబట్టి చట్టపరంగా మీకు హక్కు ఉన్నప్పటికీ హోటల్ నిబంధనలను గౌరవించడం ముఖ్యం.

మీ ఇద్దరి వయసు 18 ఏళ్లు పైబడి, మీ దగ్గర చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉంటే మీరు చట్టబద్ధంగా హోటల్ లో బస చేయవచ్చు. ప్రతి హోటల్ జంటలకు అనుకూలంగా ఉండదు. కొన్ని హోటళ్లు పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. దీంతో చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనవసరమైన వాదనలు, అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఈ సమస్య ఎదుర్కోకుండా ఉండాలంటే ఆన్ లైన్ లో బుక్ చేసేటప్పుడు కపుల్ ఫ్రెండ్లీ ఫిల్టర్ ను ఉపయోగించండి. మేక్ మై ట్రిప్, గో అబిబో, అగోడా వంటి యాప్ లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది మీకు సరైన హోటల్ ను సులభంగా ఎంచుకోవడానికి సహాయపడుతుంది. ఒక హోటల్ మీకు నచ్చిన తర్వాత వెంటనే బుక్ చేయకండి. ముందుగా ఆ హోటల్ పేరును గూగుల్ లో వెతికి, దాని రివ్యూస్ ని చదవండి.
ముఖ్యంగా ఇతర జంటలు పోస్ట్ చేసిన రివ్యూలపై దృష్టి పెట్టండి. వారి అనుభవాలు ఎలా ఉన్నాయి? హోటల్ సిబ్బంది ప్రవర్తన, గదుల శుభ్రత, భద్రత, గోప్యత వంటి విషయాలపై వారు ఏం చెప్పారో గమనించండి. నెగిటివ్ రివ్యూలు ఎక్కువగా ఉంటే ఆ హోటల్ ను వదిలివేయడం బెటర్.