రావు బాలసరస్వతి అసలు పేరు సరస్వతి.. చిన్నతనం నుంచి పాటలు పాడటంతో ‘బాల’ అనే పదాన్ని పేరు ముందు చేర్చి బిరుదిచ్చారు. యుక్త వయసు వచ్చాక కోలంక జమీందారును పెళ్లి చేసుకున్నారు సరస్వతి. అయితే బహుముఖ ప్రజ్ఞాశాలి బాలసరస్వతి దేవి కన్నుమూశారు. హైదరాబాద్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త సినీ ప్రపంచాన్ని, సంగీతాభిమానులను తీవ్ర దుఃఖ సాగరంలో ముంచింది.
1928 ఆగస్టు 29న జన్మించిన ఆమె తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దక్షిణాది కళా ప్రస్థానంలో కూడా చిరస్మరణీయ స్థానం సంపాదించారు. చిన్న వయస్సులోనే నటనపై ఆసక్తి పెంచుకున్న బాలసరస్వతీ దేవి, ‘సతీ అనసూయ’ సినిమాతో తెరంగేట్రం చేశారు. చిన్న వయస్సులోనే తెరపై మెరిసిన ఆమె, కాలక్రమంలో గాత్రంతో, నటనతో, వ్యక్తిత్వంతో తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయారు.

బాలసరస్వతి దేవి తెలుగు సినిమాకు అంకితమైన కళాకారిణి. 1940ల నుండి 1960ల దాకా ఆమె చేసిన పాత్రలు నేటికీ స్మరణీయాలుగా నిలిచాయి. ప్రధాన పాత్రలతో పాటు స్వభావ నటనలోనూ దిట్టగా ఉన్న ఆమె, ప్రతి పాత్రను జీవించేవారు. తన నటనలో ఉన్న నాటకీయత, గంభీరత, సత్యత ప్రేక్షకులను ఆకట్టుకునేవి. కాలం మారినా, ఆమె నటించిన పాత సినిమాలు ఇప్పటికీ క్లాసిక్‌గా పరిగణించబడతాయి.
నటిగా మాత్రమే కాకుండా, బాలసరస్వతీ దేవి గాత్రం కూడా తెలుగు సినీ సంగీతాన్ని మరింత బలపరిచింది. ఆమె ఒక గొప్ప నేపథ్య గాయని, లలిత సంగీతం, భక్తి గీతాలు, జానపద గీతాల పట్ల అపారమైన పట్టు కలిగి ఉన్నారు. ఆమె పాడిన పాటలు నాటి రేడియో తరంగాల్లో మార్మోగేవి. ముఖ్యంగా ఆకాశవాణిలో ప్రసారమయ్యే సంగీత కార్యక్రమాల్లో ఆమె గాత్రం తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితం. ఆ కంఠం విన్న తరాలు ఇప్పటికీ ఆ మధురస్మృతులను మరిచిపోలేవు.
