రతన్ టాటా తన మిగిలిన ఆస్తుల్లో మూడింట ఒక వంతును ట్రావెల్ సెక్టార్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్ మోహిని మోహన్ దత్తాకు చెందాలని పేర్కొన్నారు. రెసిడిడ్యువల్ అస్సెట్స్ అంటే వీలునామా చదివిన తర్వాత, ఆస్తులు వారసులకు పంపిణీ అయ్యాక, ఫైనల్ ఎక్స్‌పెన్స్‌లు చెల్లించేశాక, మిగిలిపోయిన ఆస్తులు అని అర్థం. అయితే రతన్ టాటా వీలునామాలో రూ. 500 కోట్ల విలువైన ఆస్తిని ప్రస్తావించిన మర్మమైన వ్యక్తి జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్ సెక్టార్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా. టాటా కుటుంబ సభ్యులు కూడా ఆ వీలునామా చూసి చాలా షాక్ అయ్యారని తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. మోహన్ దత్తా, అతని కుటుంబం ట్రావెల్ ఏజెన్సీ స్టాలియన్‌ను కలిగి ఉన్నారు.
దీనిని 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. మోహిని దత్తా, కుటుంబం స్టాలియన్‌లో 80% వాటాను కలిగి ఉన్నారు. మిగిలినది టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. ఆయన థామస్ కుక్ మాజీ అనుబంధ సంస్థ అయిన TC ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. రతన్ టాటాను దగ్గరగా తెలిసిన వ్యక్తులు దత్తా చాలా కాలంగా సహచరుడని, కుటుంబ సభ్యులతో సహా అతని సన్నిహితులకు సుపరిచితుడని చెప్పారు. ET నివేదిక ప్రకారం, మోహిని దత్తాను సంప్రదించినప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించారు.
వీలునామా అమలుకర్తలు, రతన్ టాటా సవతి సోదరీమణులు షిరిన్, దినా జెజీభోయ్ కూడా దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. డారియస్ ఖంబట్టా వ్యాఖ్యానించలేదు. నాల్గవ కార్యనిర్వాహకుడు మెహ్లి మిస్త్రీ ఈ వ్యక్తి గురించి వ్యాఖ్యానించడానికి ఇష్టపడటం లేదని చెప్పినట్లు ET పేర్కొంది. దత్తా ఇద్దరు కుమార్తెలలో ఒకరు 2024 వరకు 9 సంవత్సరాలు టాటా ట్రస్ట్స్‌లో పనిచేశారు. అంతకు ముందు తాజ్ హోటల్‌లో పనిచేశారు. రతన్ టాటా మరణించినప్పుడు దత్తా ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. రతన్‌టాటా 24 ఏళ్ల వయసు ఉన్నప్పటినుంచి తనకు తెలుసని అన్నారు. తాను జీవితంలో ఎదగడానికి ఆయన ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకున్నారు.
డిసెంబర్ 2024లో ముంబయిలోని NCPA (ఎన్సీపీఏ)లో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్లు సమాచారం. రతన్ టాటా రెండు ట్రస్టులను సృష్టించారు.. రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం దాతృత్వ కార్యక్రమాలకు అంకితం చేశారు. లబ్ధిదారులుగా పేర్కొనబడిన అతని సవతి సోదరీమణులు కూడా తమ వాటాను విరాళంగా ఇవ్వాలనే కోరికను వ్యక్తం చేశారని అర్థమవుతోంది. ఈ రహస్యం బయటపడిన తర్వాత టాటా సర్కిల్‌లో చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. రతన్ టాటా తన చివరి సంవత్సరాల్లో తన సంపదలో గణనీయమైన భాగాన్ని విరాళంగా ఇవ్వడానికి రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ అనే రెండు సంస్థలను స్థాపించారు.
వివిధ అంచనాల ప్రకారం.. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో ఆయనకు నేరుగా 0.83 శాతం వాటా ఉంది. ఆయన మొత్తం సంపద దాదాపు రూ. 8,000 కోట్లు. రతన్ టాటా సంపద పేర్కొన్న సంఖ్య కంటే చాలా ఎక్కువ అని అంచనా వేసినట్లు వర్గాలు చెబుతున్నాయి. టాటా సన్స్ షేర్లతో పాటు, రతన్ టాటాకు ఫెరారీ, మసెరటి వంటి లగ్జరీ కార్లు, ఖరీదైన పెయింటింగ్‌లు, స్టార్టప్‌లలో వాటాలు, ఇతర పెట్టుబడులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. రతన్ టాటా వ్యక్తిగత పెట్టుబడులను పర్యవేక్షించే రతన్ టాటా అసోసియేట్స్, FY23 నాటికి రూ. 186 కోట్లు పెట్టుబడి పెట్టింది. రతన్ టాటా ఆస్తులను పంపిణీ చేయడానికి వీలునామాను త్వరలో ప్రొబేట్ కోసం సమర్పించి, హైకోర్టు ధృవీకరించినట్లయితే మాత్రమే వీలునామాను పంపిణీ చేయవచ్చు. ఈ ప్రక్రియకు ఆరు నెలల వరకు పట్టవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.