గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే ఒక కుటుంబ సంస్థగా ఎదుగుతూ వచ్చిన టాటా గ్రూప్ నేడు ఆ సంస్థలకు నాయకత్వం వహించే తదుపరి వారసుడు ఎవరు అనే సందిగ్ధావస్థకు చేరింది. 86 సంవత్సరాల రతన్ టాటా మరణం తరువాత ఆయన వారసుడు ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. ముఖ్యంగా రతన్ టాటా బ్రహ్మచారి కావడంతో ఆయనకు వారసులు లేరు. అయితే ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి రతన్ టాటా 2017 లో తప్పుకొని టిసిఎస్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కు అప్పగించారు.
ఇక టాటా గ్రూప్ ను నిర్వహించే పేరెంట్ కంపెనీ టాటా సన్స్ చైర్మన్ హోదాలో కూడా నటరాజన్ చంద్రశేఖరన్ ఉన్నారు. టాటా సన్స్ లో 66% వాటాలు టాటా కుటుంబం నిర్వహించే పలు సేవా సంస్థల పేరిట ఉన్నాయి. ఇందులో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ సంస్థలు టాటా సన్స్ లో దాదాపు 50% వాటాలతో అతిపెద్ద వాటాదారులుగా ఉన్నారు. రతన్ టాటా సోదరుడు నోయల్ నావల్ టాటాకు టాటా సన్స్ లో ఒక శాతం వాటా ఉంది. ఇదిలా ఉంటే రతన్ టాటా తర్వాత టాటాలకు వారసుడు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. టాటా గ్రూపును భుజాలపై ఎత్తుకునేందుకు టాటా కుటుంబానికి చెందిన వారిలో ఎవరికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం.
రతన్ టాటా అనంతరం ప్రస్తుతం టాటా వారసులైన లియా టాటా, మాయ టాటా, నెవిల్లే టాటా పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ నావల్ టాటా పిల్లలే లియా టాటా, మాయ టాటా, నెవిల్లే టాటా. వీరిలో లియా, మాయా ఆడపిల్లలు కాగా, నెవిల్లే టాటా మగవాడు. వీరు టాటా గ్రూప్‌లో వివిధ బాధ్యతల్లో ముందుకు సాగుతున్నారు. లియా టాటా: లియా టాటా విషయానికి వస్తే ఈమె స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని IE బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2006 సంవత్సరంలో తాజ్ హోటల్స్ రిసార్ట్స్ ప్యాలెస్‌లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా టాటా గ్రూప్‌లో ఆమె తన ప్రస్థానం ప్రారంభించారు.
అంచెలంచెలుగా ఎదిగిన లియా టాటా ప్రస్తుతం ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL)లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. మాయా టాటా: నోయల్ నావల్ టాటా చిన్న కుమార్తె పేరే మాయా టాటా. ప్రస్తుతం ఆమె టాటా గ్రూప్ కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ టాటా క్యాపిటల్‌లో పనిచేస్తున్నారు. నెవిల్లే టాటా: ఇక టాటాల వారసుడు నెవిల్లే టాటా తన కెరీర్ టాటాకు చెందిన ట్రెంట్ సంస్థలో ప్రారంభించాడు. వీరు మాత్రమే కాదు టాటా లతో బంధుత్వం కలిగి ఉన్న షాపూర్జీ పల్లోంజీ వారసులు సైతం, టాటా సన్స్ లో వాటాదారులుగా ఉన్నారు. అయితే టాటా గ్రూపులో ఉన్న నిబంధనల ప్రకారం బోర్డు నిర్ణయం మేరకే వారసులను నిర్ణయిస్తారు. అలాగే రతన్ టాటా పేరిట ఉన్న షేర్లను ఎవరికి బదలాయించాలి అనేది ఆయన వీలునామాను బట్టి నిర్ణయం తీసుకుంటారు.