దీపావళి వేడుకలను ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.దీపావళి పర్వదినం వేళ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.ఏ ఇల్లు చూసినా దీపాలు, విద్యుత్ కాంతులతో అలంకరించి సంబరాలు చేసుకుంటారు. అయితే కరీంనగర్ లో ఆరు దశబ్దాలకు పైగా స్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కోనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటు.. తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు.
వినడానికి కోంత వింతగా అనిపించిన చాలా కుటుంబాలు ఈ తంతును ఆచరిస్తున్నాయి. కరీంనగర్ లోని కార్ఖన గడ్డలో ఉన్న హిందు స్మశాన వాటిక లో ప్రతి యేటా దళిత కుటుంబాలు స్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటారు. పండగకు వారం రోజుల ముందే స్మశాన వాటిక వద్ద అంత శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు.

చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంత శుభ్రం చేసిన తరువాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి.. పండగ రోజును సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని అక్కడే గడుపుతారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెప్తుంటారు.
అందుకోసమే చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేధ్యంగా పెడతారు. పితృ దేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఇదీ కాస్త వింత గానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు.
