ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే సింపుల్ రెమెడీస్‌ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మందికి తిన్న తర్వాత ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉంటుంది. సమయానికి తినలేకపోవడం, ఆహారం సరిగ్గా నమలకపోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఓ 23 ఏళ్ల యువకుడు గత కొన్నిరోజులుగా అజీర్తి సమస్యతో బాధపడుతున్నాడు. మందులు ఎన్ని వేసుకున్నా.. అది తగ్గలేదు. ఇక చేసేదేమీలేక చివరికి డాక్టర్‌ను కన్సల్ట్ అయ్యాడు. కట్ చేస్తే.. ఆ రోగికి ఎక్స్‌రే తీసి.. దెబ్బకు షాక్ తిన్నారు వైద్యులు.
ఈ ఘటన ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా అజీర్ణ సమస్యతో బాధపడుతున్న 23 ఏళ్ల వ్యక్తి.. ఎంతకూ ఆ రోగం తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు అతడికి సాధారణ పరీక్షలు నిర్వహించగా.. ఎక్స్‌రే చూసి దెబ్బకు షాక్ అయ్యారు. అతని కడుపులో సజీవంగా బతికున్న బొద్దింకను చూసి కంగుతిన్నారు. చిన్న ప్రేగుల లోపల ఆ బొద్దింక ఉన్నట్టు గుర్తించారు.
ఆ తర్వాత 10 నిమిషాల ఎండోస్కోపీ ప్రక్రియను పూర్తి చేసి.. వసంత్‌కుంజ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా బ్రతికున్న 3 సెంటీమీటర్ల బొద్దింకను బయటకు తీశారు. ఆ ఆస్పత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ వాత్స్యా మాట్లాడుతూ.. ‘రోగికి తాను బొద్దింకను తిన్నట్లు తెలియదు. అలాగే ఆ బొద్దింక చెక్కుచెదరకుండా ఉండటం చూసి మేము ఆశ్చర్యపోయాం. గడిచిన రెండు లేదా మూడు రోజులలో రోగి ఆహారం తిన్న తర్వాత అజీర్తి, ఉబ్బరంతో బాధపడ్డాడు.
సాధారణ పరీక్షలు నిర్వహించగా.. బొద్దింక ఉన్నట్టు తేలింది’ అని డాక్టర్ వాత్స్యా తెలిపారు. ఎండోస్కోపీ ద్వారా బొద్దింకను బయటకు తీసిన వైద్యులు.. ప్రస్తుతం రోగి ఆరోగ్యం కుదుటపడుతోందని చెప్పారు. చిన్న ప్రేగుల్లో బ్రతికున్న బొద్దింకతో ప్రాణాలకు ముప్పు.. లేదా లేనిపోని అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. అందుకే సదరు రోగికి వెంటనే ఎండోస్కోపీ సాయంతో శస్త్రచికిత్స చేశామని డాక్టర్ వాత్స్యా స్పష్టం చేశారు.