గతంలో బంగారు ఆభరణాల వ్యాపారులు మాత్రమే ఆ ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలిగేవారు. అయితే, మారిన రూల్స్ ప్రకారం బంగారం, వెండిని ఉపయోగించే పరిశ్రమలు, కర్మాగారాలు కూడా అలాంటి రుణాలను పొందవచ్చు. కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి కూడా ఈ రుణాలు పొందవచ్చు. అయితే ఇటీవలి కాలంలో దేశంలో వెండి దిగుమతులు పెరిగాయి.
ప్రభుత్వంతో పాటు పలు భారతీయ పరిశ్రమలు కూడా వెండిని కొనుగోలు చేస్తున్నాయి. సోలార్ విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5జీ కమ్యూనికేషన్ పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాలు వంటి రంగాల్లో వెండిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ రంగాల్లో పెరిగిన అవసరాల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో వెండి ధరలు మరింత పెరిగిపోయాయి.

అందుకే ప్రస్తుతం బంగారం లాగానే వెండికి కూడా స్థిరమైన సంపదగా స్థానం దక్కుతోంది. ఇది పెట్టుబడిదారులకు మరింత నమ్మకాన్ని కలిగిస్తూ, వెండిలో పెట్టుబడి పెట్టే అవకాశాలను విస్తరిస్తోంది. ఇప్పటివరకు బంగారు ఆభరణాలపై మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. కానీ త్వరలో వెండి ఆభరణాలను కూడా తాకట్టు పెట్టి రుణం పొందే అవకాశం అందుబాటులోకి రానుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్ బీఐ (RBI) విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 2026 ఏప్రిల్ 1 నుంచి వెండి ఆధారిత రుణాలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెండి విలువను బట్టి లోన్ లిమిట్ నిర్ణయిస్తారు. కేవలం ఆభరణాలు, నగలు, నాణేలపైనే లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. వెండి బార్లు లేదా సిల్వర్ ఈటీఎఫ్‌లు తాకట్టు పెట్టి రుణం పొందడం సాధ్యం కాదు.
