బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టికి ఊహించని షాక్ తగిలింది. ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసు విచారణలో భాగంగా.. శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు బాంబే హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే శిల్పాశెట్టి కేవలం ఒక రెస్టారెంట్‌తో ఆగిపోలేదు. రంజిత్ బింద్రా అనే వ్యాపారవేత్తతో కలిసి ‘బాస్టియన్ హాస్పిటాలిటీ’ పేరుతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది.
2025 నాటికి ఈ బ్రాండ్ విలువ దాదాపు రూ.127 కోట్ల రూపాయలకు చేరుకుంది. కేవలం ముంబైలోనే కాకుండా బెంగళూరు, పూణే వంటి నగరాల్లోనూ ఈమె హోటల్స్ ఉన్నాయి. గతేడాది ముంబైలోని బాంద్రాలో ఉన్న పాత బాస్టియన్ బ్రాంచ్‌ను మూసివేసి, దాని స్థానంలో తన మూలాలకు గౌరవంగా ‘అమ్మకై’ అనే దక్షిణ భారతీయ వంటకాల రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా జుహులో ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో సరికొత్త హంగులతో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఈమె రెస్టారెంట్లలో లగ్జరీ ఏ స్థాయిలో ఉంటుందో రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెనూ ప్రకారం.. ఇక్కడ ఒక కప్పు టీ ధర దాదాపు 960 రూపాయలు. ఇక సాధారణ టోస్ట్ ధర 800 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఖరీదైన వైన్ ఆర్డర్ చేస్తే, దాని ధర అక్షరాలా లక్షన్నర రూపాయల పైమాటే.
‘ఇంకా’, ‘బ్లాండీ’ వంటి విభిన్న కాన్సెప్టులతో ఈమె తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. అయితే ఇటీవల ఈమె వ్యాపారాలపై కొన్ని వివాదాలు, ఐటీ దాడులు వంటి వార్తలు వచ్చినప్పటికీ, వ్యాపారపరంగా ఈ భామ సృష్టిస్తున్న రికార్డులు మాత్రం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.
