ఆస్తుల వివాదంపై వై.ఎస్.సతీమణి విజయమ్మ స్పందించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు తనను చాలా చాలా బాధిస్తున్నాయి అని ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో తనకు అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ‘రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి హృదయానికి, మా కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికి విజయమ్మ చేస్తున్న విజ్ఞప్తి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు మనసుని చాలా బాధపెడుతున్నాయి. పెద్దలంటారు “ఇంటి గుట్టు బట్టబయలు కాకూడదు” అని.. రాజశేఖర్ రెడ్డి కూడా అదే మాట చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా మారాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది.
ఏమో, మా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నా కళ్ల ముందే అనుకోని ఘటనలు జరుగుతుండటంతో తీవ్ర వేదన కలుగుతోంది. మా కుటుంబం గురించి అనేక రకాల వదంతులు వస్తున్నాయి. కొందరు తెలిసి, మరి కొందరు తెలియక, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు సమాచారాలు విస్తరిస్తూ, దావానలం మాదిరిగా వ్యాపిస్తున్నాయి. ఇవి ఇక ఆగాల్సిన అవసరం ఉంది. మా పిల్లలిద్దరికీ మాత్రమే కాదు, రాష్ట్రానికి కూడా ఇది మంచిది కాదు. ఈ విషయంలో ప్రజల ముందు రాకూడదని అనుకున్నా, పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి ప్రేమగా మాట్లాడే, సంతోషంగా ఆత్మీయంగా ఆదరించే వారందరికి నా మనవి.
రాజశేఖర్ రెడ్డి మన మధ్యలేని దుఃఖంలో, మీరు మా పిల్లలను ఆయనున్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి ఆదరించి అక్కున చేర్చుకున్నారని నేను ఎప్పటికీ మర్చిపోను. అందుకు మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దయచేసి మా కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కుతంత్రాలు, వదంతులు రాయవద్దని నా ప్రాధేయం. మాకు నిజమైన ప్రేమ ఉంటే, ఇంతకంటే ఎక్కువగా మాట్లాడి పిచ్చి కథలు సృష్టించవద్దన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారు రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన కుటుంబ పరువు తీర్చడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ఆస్తులు పంచలేదు.
ఉన్న ఆస్తులను సరైన పద్ధతిలో మాత్రమే చూసుకున్నారు. కుటుంబ ఆస్తులపై నిజాలు చెప్పాల్సిన అవసరం కలిగింది. ఆస్తులు రెండింటికీ సమానంగా పంచాలని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కోరుకునేవారు. జగన్ బాధ్యతగల కుమారుడిగా ఆస్తులను సంరక్షించాల్సి ఉంటుంది. 2019లోనే కుటుంబంలో ఆస్తుల డివిజన్ జరిగింది. జగన్ తన సోదరిని ప్రేమతో ఆదరించి డివిడెండ్ రూపంలో కూడా ఆస్తులు పంచే వాడు. ఈ విషయంలోని నిజాలు కూడా తెలియజేస్తున్నా. మా ఇద్దరు పిల్లలు సమానమైన ప్రేమను పొందుతున్నారు. తల్లిగా తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు, నిజం బయట పెట్టే బాధ్యత నాదని భావిస్తున్నా’ అని వెల్లడించారు.
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల గొడవ గురించి మొదటి సారి స్పందించిన వైఎస్ విజయమ్మ..
— RTV (@RTVnewsnetwork) October 29, 2024
నా కుటుంబానికి దిష్టి తగిలండంటూ ఎమోషనల్ బహిరంగ లేఖ ..@realyssharmila @ysjagan @YSRCParty @JaiTDP#ysvijayamma #letter #yssharmila #YSJaganMohanReddy #YSRCP #RTV pic.twitter.com/Dvrx5F8N4P