సమశీతోష్ణ మండలాల్లో, స్క్రబ్ టైఫస్ సీజన్ ప్రధానంగా శరదృతువులో గమనించవచ్చు, కానీ వసంతకాలంలో కూడా సంభవిస్తుంది. ఒక వ్యక్తిని సోకిన మైట్ కాటు వేస్తే, వ్యాధి 7-10 రోజుల్లో సంభవిస్తుంది మరియు తగిన చికిత్స లేకుండా సాధారణంగా 14-21 రోజులు ఉంటుంది. అయితే చాలా మందికి ఈ వ్యాధి పేరు కూడా తెలియకపోవడంతో ప్రజలు దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, నేలపై ఉండే కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుంది.
ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, జంతువులకు దగ్గరగా ఉండేవారు, అడవి ప్రాంతాల్లో తిరిగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం వైద్య శాఖ అప్రమత్తమైంది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తోంది. స్క్రబ్ టైఫస్ జ్వరం అంటే ఏంటి.? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది.? చికిత్స ఏంటి.? స్క్రబ్ టైఫస్ అనేది చిగ్గర్స్ అనే సూక్ష్మ కీటకాలు కుడితే వ్యాపిస్తుంది. కాటు వేసిన ప్రదేశంలో చిన్న నల్లటి మచ్చ కనిపించడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం.

గడ్డి, పొలాలు, తడి నేలలు, చెత్తతో ఉన్న ప్రదేశాల్లో ఈ సూక్ష్మ కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కాటు ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎలుకలు, అడవి జంతువులు ఈ బ్యాక్టీరియాకు నిల్వ కేంద్రాలు. వీటి మీద ఉండే కీటకాలు మనుషులపైకి వస్తూ ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు చూస్తే.. ఉన్నట్లుండి జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్లు నొప్పులు. కాటు ప్రదేశంలో నల్లటి మచ్చ, దద్దుర్లు, శ్వాస సమస్యలు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు. ఇక తీవ్రమైన దశలో అవయవాల వైఫల్యం, లివర్, కిడ్నీలు, నర్వస్ సిస్టమ్ సమస్యలు రావచ్చు.
ప్రస్తుతం శీతకాలం సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఒకటికి రెండు రోజులు జ్వరం గనక ఎక్కువగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి రావాలసి సూచిస్తున్నారు వైద్యులు. స్క్రబ్ టైఫస్ బాధితులకు వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సోకితే అలాంటివారు రికవర్ కావడం కాస్త కష్టం అంటున్నారు డాక్టర్లు.. జ్వరం ఎక్కువ రోజులు తగ్గకపోవడం, గాయం దగ్గర దుర్వాసన, శరీర నొప్పులు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జనాల్లో భయం ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు, సమయానికి చికిత్స ఉంటే స్క్రబ్ టైఫీస్‌ను నియంత్రించవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
