వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో శ్యామల జీవితం అస్యవ్యస్తంగా మారింది. నటితో పాటు ఆమె కూతురు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం అందరినీ కలచివేస్తోంది. గతంలో చాలా మంది సినీ ప్రముఖులు శ్యామలకు ఆర్థిక సాయం అందజేశారు. కానీ ఆ డబ్బులు వారి మందులు, ఇతర అవసరాలకే సరిపోయాయి. అయితే నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన పావలా శ్యామల తన కామెడీ టైమింగ్‌తో.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న పాత్రలైనా సరే, తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.
ఒక దశలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె..కాలక్రమంలో అవకాశాలు తగ్గిపోవడంతో.. ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లారు. వయస్సు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల ఆమె పరిస్థితి..మరింత దిగజారింది. ఆమెకు ఆసరాగా ఉన్న కూతురు అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. తానే సరిగా కదలలేని పరిస్థితిలో ఉండగా, కూతురి బాధ్యత కూడా తనపై పడటంతో మానసికంగా కుంగిపోయారు.

మందుల ఖర్చు నెలకు దాదాపు పది వేల రూపాయలు అవుతుండగా.. ఆ మొత్తాన్ని సమకూర్చుకోవడం కూడా కష్టంగా మారింది. కొన్ని రోజుల పాటు ఒక కేర్ సెంటర్‌లో ఆశ్రయం పొందిన పావలా శ్యామల.. ఆమె కూతురు..అక్కడినుంచి బయటకు పంపించబడ్డారని వార్తలు వినిపించాయి. ఆ సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరిద్దరూ తీవ్ర నిరాశకు లోనయ్యారని తెలుస్తోంది. తమకు ఎవరూ లేరన్న భావనతో.. ఇక జీవితం చాలనుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, వీరిద్దరిని రక్షించారు. ప్రస్తుతం ఆర్‌కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. అక్కడ తన పరిస్థితి గురించి ఓ ఛానెల్‌కు మాట్లాడుతూ పావలా శ్యామల కన్నీటి పర్యంతమయ్యారు. “ఎంతమంది ఆదుకున్నా.. మా కష్టాలు తీరడం లేదు. నా బిడ్డ ఒంటరిగా మిగిలిపోతుందనే భయమే నాకు ఎక్కువగా ఉంది” అని ఆమె వేదన వ్యక్తం చేశారు.
“నేను చనిపోతే నా కూతురు ఏమవుతుందోనని భయపడుతున్నాను. దేవుడు నా బిడ్డ కోసమే నన్ను బతికిస్తున్నాడేమో..” అంటూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
