అస్సామీ ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఓ ప్రదర్శన నిమిత్తం సింగపూర్ వెళ్లారు. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రఖ్యాత అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్ లో మరణించారు. కొంతకాలం క్రితం ఆయన ఈశాన్య ఉత్సవంలో పాల్గొనడానికి సింగపూర్‌కు వెళ్లారని..
అక్కడ ఆయన స్కూబా డైవింగ్ చేసే సమయంలో ప్రమాదానికి గురయ్యారనే వార్తలు వినిపించాయి. దీని తరువాత జుబీన్ గార్గ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జుబిన్ మరణించాడు. ఈ వార్త విన్న అతని అభిమానులు షాక్ అయ్యారు.

ఈ విషాద వార్తని మొదట్లో ఎవరూ నమ్మలేదు. ప్రమాదం తర్వాత జుబిన్‌ను ఐసియులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అతను నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మీడియా నివేదికల ప్రకారం జుబిన్ స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు.
జుబిన్‌ను కాపాడటానికి వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. అయినా అతన్ని కాపాడలేకపోయారు. జుబిన్ గాయకుడిగా ప్రయాణం గురించి చెప్పాలంటే.. అసాధారణ గాయకుడిగా ఖ్యాతిగాంచాడు. అంతేకాదు నటుడు, రచయిత కూడా. జుబిన్ నవంబర్ 18, 1972న మేఘాలయలో జన్మించాడు. అస్సామీలతో పాటు, జుబిన్ బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మరాఠీ, మిసింగ్, నేపాలీ, ఒడియా, సంస్కృతంతో సహా దాదాపు 60 భాషలలో పాటలు పాడాడు.