ఎలుకల వల్ల కేవలం గ్రామీణ ప్రాంతాల వారే కాదు, పట్టణాల ప్రజలు విసిగిపోతుంటారు. ప్రస్తుతం అయితే రబీ పంటలు తీసి నిల్వ చేసే సమయం. ఇలాంటి సమయంలో ధాన్యాన్ని ఎలుకల నుంచి కాపాడుకోవడం చాలా అవసరం. ఎలుకల బెడద ఎంతగా ఉంటుందంటే, అవి ఇంట్లో వాళ్లకి పెద్ద తలనొప్పిగా మారుతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఇంటి నుంచి పోయే పేరు చెప్పవు. అయితే ఉల్లిపాయల్లో ఉండే ఘాటైన వాసన ఎలుకలకు అసహనంగా మారుతాయి. వంటగదిలో లేదా ఎలుకలు తక్కువగా రావలసిన చోట ఉల్లిపాయ ముక్కలు లేదా తొక్కలు ఉంచడం వలన అవి దూరంగా ఉంటాయి.
రోజూ ముక్కలను మార్చడం వల్ల మంచి ఫలితాలు చూడొచ్చు. ఇది సులభంగా చేయగల ఇంటి ప రిష్కారం. లవంగాలు కూడా ఎలుకలకు భరించలేని వాసనను కలిగిస్తాయి. కొన్ని లవంగాలను ముడత బట్టలో చుట్టి లేదా దూదిలో పెట్టి ఎలుకలు ఎక్కువగా కనిపించే చోట ఉంచితే అవి అక్కడికి రావడం తగ్గుతుంది. అలాగే లవంగ నూనెను దూదిపై వేసి ఉంచినపుడు కూడా ఇదే విధంగా పని చేస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే బేకింగ్ సోడా సహాయంతో కూడా ఎలుకల దాడిని తగ్గించవచ్చు. ఎలుకలు వస్తున్న ప్రదేశాల్లో చిన్న మొత్తంలో బేకింగ్ సోడా చల్లడం వలన అవి అక్కడికి రావాలనే ఆసక్తి కోల్పోతాయి.

మిరియాలు గొప్ప వాసనతోపాటు ఘాటుగా ఉండే తత్వం కలిగి ఉంటాయి. మిరియాల పొడి ఎలుకలు కనిపించే మూలల్లో చల్లడం వలన అవి భయపడతాయి. ఇది ఇతర జంతువులకు హాని లేకుండా పని చేసే మార్గం. కారం పొడి వాసన ఎలుకల శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితో అవి ఆ ప్రదేశానికి రాలేవు. కారం పొడి ఎలుకల మార్గంలో చల్లడం వలన అవి ఆ దారి మార్చుకుంటాయి. కర్పూర వాసన చాలా బలంగా ఉంటుంది. తులసి నూనెతో కలిపిన కర్పూరాన్ని ఒక దూదిలో వేసి ఎలుకలు వచ్చే ప్రదేశంలో ఉంచితే.. దాని వాసనతో అవి అక్కడికి రావడం మానేస్తాయి. దీనితోపాటు ఇంట్లో శుభ్రత వాతావరణం కూడా నెలకొంటుంది.
ఎలుకల బెడదను నివారించడంలో పిల్లులు సహాయకారులుగా నిలుస్తాయి. ఇంట్లో పిల్లి ఉనికి వలన ఎలుకలు దూరంగా ఉంటాయి. పిల్లి వాసనతోపాటు వాటి శబ్దాలు కూడా ఎలుకలను భయపెడతాయి. కావున ఇంట్లో పిల్లిని పెంచడం మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఈ ఇంటి చిట్కాలను పాటించడం వలన ఎలుకల బెడద తగ్గుతుంది. రసాయనాలు లేకుండా సురక్షితమైన ఈ పద్ధతులు కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడతాయి. సహజ పదార్థాలతో ఇంటిని ఎలుకల నుండి కాపాడుకోవచ్చు.