రతన్ టాటా. అనారోగ్య కారణాలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో అక్టోబర్ 9 రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా తండ్రి పేరు నావల్ టాటా. అయితే నావల్ టాటా కంటే ముందు అతని పూర్వికులు ఎవరికీ ‘టాటా’ అనే ఇంటిపేరు లేదు. అయితే రతన్ టాటా తండ్రి నావల్ 1904 ఆగస్టు 30వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి అహ్మదాబాద్ లోని అడ్వాన్స్ మిల్లులో స్పిన్నింగ్ మాస్టర్ గా పనిచేసేవారు. నావల్ కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన మరణించారు. దీంతో నావల్ ను తీసుకుని తల్లి గుజరాత్ లోని నవ్ సారికి బతుకుతెరువు కోసం వెళ్లారు.
అక్కడ ఆమె ఎంబ్రాయిడరీ పనిచేసేవారు. దీంతో నావల్ ను జేఎన్ పెటిట్ పార్సీ అనాథ ఆశ్రయంలో చేర్చారు. అక్కడే ఆయన చదువుకునేవాడు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ నకు చెందిన రతన్ జీ జంసెట్ జీ టాటా, ఆయన భార్య నవాజ్ బాయి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ నావల్ ను చూసి ముచ్చటపడి దత్తత తీసుకున్నారు. అలాగ నావల్ తన 13 ఏళ్ల వయసులో టాటా కుటుంబానికి దత్త పుత్రుడయ్యారు. టాటా కుటుంబంలోకి వచ్చిన తర్వాత నావల్ చదువు బాగా సాగింది. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. అనంతరం లండన్ లో అకౌంటింగ్ కు సంబంధించిన కోర్సును పూర్తి చేశారు.
చిన్నతనంలో నుంచి పేదరికంలో గడిపిన నావల్ కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రతి పనినీ పట్టుదల పూర్తి చేసేవారు. ఆయన రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య సూని కమసరియట్ కు రతన్ టాటా, జిమ్మీ టాటా జన్మించారు. భేదాభిప్రాయాలు వచ్చి సూనితో విడిపోయిన తర్వాత సిమోన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నోయోల్ టాటా జన్మించారు. నావల్ 1930లో టాటా సన్స్ లో చేరారు. అక్కడ క్లర్క్ కమ్ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1933లో విమానయాన శాఖ కార్యదర్శిగా పదోన్నతి లభించింది. ఆ తర్వాత టాటా మిల్స్, ఇతర యూనిట్లతో అనుబంధం ఏర్పడింది. అనంతరం 1941లో టాటా సన్స్ డైరెక్టర్ గా, 1961లో టాటా పవర్ చైర్ పర్సన్ గా పనిచేశారు.
ఏడాది తర్వాత టాటా సన్స్ డిప్యూటీ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నావల్ టాటా ఎంతో చురుకుగా ఉండేవారు. సర్ రతన్ టాటా ట్రస్ట్ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఇండియన్ హామీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ వైస్ చైర్ పర్సన్ గా సేవలందించారు. రాజకీయాలకు సంబంధించి 1971 ఎన్నికలలో సౌత్ బాంబే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నావల్ టాటాకు 1969లో పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఆయన క్యాన్సర్ తో బాధపడుతూ 1989 మే 5న ముంబైలో కన్నుమూశారు.