ఈ కుంభమేళాలో చిత్ర విచిత్రమైన బాబాలు భక్తులను ఆకట్టుకుంటున్నారు. వారిని దర్శిచేందుకు భక్తులు సైతం క్యూ కడుతున్నారు. ఒకరు తలపై బార్లీ పంట సాగుచేస్తుంటే.. మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు. 45 కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలు ధరించిన వారు మరొకరు.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు కాస్తపెద్దగానే ఉంటుంది. అయితే బాహుబలి బాబా అసలు పేరు ఆత్మప్రేమ్ గిరి మహరాజ్. ఈయన రష్యా దేశానికి చెందినవారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా ఈ బాబా తిరిగారు.
ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు రావడం ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. భారత పర్యటనలో ఉండగా సనాతన ధర్మంతో బాహుబలి బాబాకు పరిచయం ఏర్పడింది. హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించిన ఆయన, వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మప్రేమ్ గిరి మహరాజ్‌గా మార్చుకున్నారు. ఈక్రమంలో పైలట్ బాబాకు శిష్యుడిగా మారిపోయారు. భారత్‌లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను చదివారు. దీని తర్వాత బాహుబలి బాబా నేపాల్‌కు వెళ్లి అక్కడే సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు.
హిందూ ధర్మంలోకి ప్రవేశించకముందు ఆయన రష్యాలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కుంభమేళా, మహాకుంభ మేళా జరిగినప్పుడల్లా బాహుబలి బాబా నేపాల్ నుంచి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు. ఆత్మప్రేమ్ గిరి మహరాజ్(బాహుబలి బాబా) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటారు. ఆయన ఆసక్తికర ఆధ్యాత్మిక ప్రసంగాలను చాలా మంది చూస్తుంటారు.
బాహుబలి బాబా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని ఫొటోలను చూస్తే, ఆయనకు వ్యాయామం, యోగా, ధ్యానంపై ఎంతటి ఆసక్తి ఉందో అర్థమైపోతుంది. ఆహారం, పానీయాల విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. దేహ సౌష్టవం ఆకట్టుకునేలా ఉండటంతో ఈ బాబాను కొందరు నెటిజన్లు భీముడు అని, మరికొందరు పరశురాముడు అని పిలుస్తుంటారు.