Rajiv Gandhi University Of Knowledge Technologies Invites Applications For Iiit Seats

Rajiv Gandhi University Of Knowledge Technologies Invites Applications For Iiit Seats

IIIT: ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను ఆరేళ్ల బీటెక్‌ సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఒక్కో సెంటర్‌లో 1,000 సీట్లు ఉండగా ఈడబ్ల్యూఎస్‌ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా జూన్‌ 25వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. వీటిలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీ–ఏకు 7 %, బీసీ–బీకి 10 %, బీసీ–సీకి 1%, బీసీ–డీకి 7%, బీసీ–ఈకి 4% చొప్పున రిజర్వేషన్‌ అమలు చేస్తారు. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 5%, సైనికోద్యోగుల పిల్లలకు 2%, ఎన్‌సీసీ విద్యార్థులకు 1%, స్పోర్ట్స్‌ కోటా కింద 0.5%, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా కింద 0.5% రిజర్వేషన్‌క కల్పిస్తారు. అలాగే ప్రతీ కేటగిరీలోనూ 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.

ఈ సీట్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024లో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 31–12–2024 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఇక విద్యార్థులను పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్‌ హైస్కూళ్లు, మున్సిపల్‌ హైస్కూళ్లలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4% డిప్రెవేషన్‌ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. 85% సీట్లను స్థానికం గాను, మిగిలిన 15% సీట్లను మెరిట్‌ కోటాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి