భూమి కొనుగోలు చేయాలి అనుకునే వారు.. ఆ రేటుకు బేరం ఆడి ఎంతో కొంత తగ్గించి.. కొనుగోలు చేస్తుంటారు. ఎక్కడైనా భూ విక్రయాల్లో జరిగేది ఇదే. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. తన 4 ఎకరాల భూమిని విక్రయించేందుకు కొత్త పద్దతిని ఎంచుకున్నాడు. లక్కీ డ్రా పద్దతిలో తన భూమిని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే భీమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలనుకునే వారు ఎవరైనా రూ.10 వేలు చెల్లిస్తే, వారికి ఒక టోకెన్ ఇస్తారు.
అయితే డ్రా తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. మొత్తం 1500 టోకెన్లు అమ్ముడైన తర్వాతే లక్కీ డ్రా నిర్వహిస్తానని రైతు స్పష్టం చేశాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు డ్రా తేదీ వివరించనని చెప్పుకొచ్చాడు.ఈ లక్కీ డ్రా ఆఫర్ వివరాలతో కూడిన పెద్ద ఫ్లెక్సీని భీమేష్ తన చేనువద్ద ఏర్పాటు చేశాడు. అందులో భూమి సర్వే నంబర్లు, రూట్ మ్యాప్, పేమెంట్ విధానాలు మొదలైన వివరాలు ఉన్నాయి.

స్థానికులు ఆ ఫ్లెక్సీని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది ఈ ఆఫర్ గురించి ఆసక్తిగా చర్చిస్తున్నారు. గ్రామస్థుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్కీ డ్రా ద్వారా భీమేష్ సాధారణ విక్రయానికి మించిన లాభం పొందవచ్చని అంటున్నారు. ఉదాహరణకు, 1500 మంది రూ.10 వేలు చొప్పున చెల్లిస్తే మొత్తం రూ.1.5 కోట్లు వస్తాయి. ఇది స్థానిక మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ.
అందుకే ఈ పద్ధతి అతడికి లాభదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు ఈ ఆఫర్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రా తేదీ స్పష్టంగా ప్రకటించకపోవడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకపోవడం, భూమి హక్కుల బదిలీపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు అనేక మందిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే భీమేష్ మాత్రం నవంబర్ తొలి వారంలో డ్రా తేదీని ప్రకటిస్తానని చెబుతున్నాడు.
