రోజు రోజుకు రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవిస్తోంది. దీనికి ప్రధానం కారణం వాహనదారులు అతి వేగంగా వెళ్లడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం.. మద్యం సేవించి వాహనం నడపడం లాంటి కారణాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో జరిమానా మొత్తాన్ని ముందుగానే నిర్ణయిస్తారు. కానీ యూరప్‌లో ఉన్న ఫిన్లాండ్లో వ్యవస్థ భిన్నంగా ఉంటుంది.
ఇక్కడ ట్రాఫిక్ చలాన్ లేదా జరిమానా మొత్తాన్ని ఆదాయం ఆధారంగా నిర్ణయిస్తారు. దీన్ని చేస్తున్న ఏకైక దేశం ఫిన్లాండ్ కాదు. ఐరోపాలోని కొన్ని ఇతర దేశాలలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. కానీ ఆదాయ ఆధారిత ట్రాఫిక్ జరిమానాలను అమలు చేసిన మొదటి దేశం ఫిన్లాండ్. 1920లో ఆదాయ ఆధారిత జరిమానాలను అమలు చేసిన మొదటి దేశం ఫిన్లాండ్.
ఫిన్లాండ్ నుండి నేర్చుకుంటూ స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి ఇతర యూరోపియన్ దేశాలు కూడా త్వరలోనే ఈ వ్యవస్థను అమలు చేయనున్నాయి. ఫిన్లాండ్లో దీనిని ఫిన్నిష్ భాషలో ‘పావసక్కో’ అని పిలుస్తారు. అంటే రోజువారి ఆదాయాన్ని బట్టి జరిమానా ఉంటుంది. సాధారణంగా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా వేయాలంటే వారి రోజు వారీ ఆదాయం లెక్కిస్తారు. దీని ఆధారంగా వారికి జరిమానా వేస్తారు. అయితే ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
నేరం ఎంత తీవ్రమైనది, నేరస్థుడి రోజువారీ ఆదాయం ఎంత వంటివి ఉంటాయి. అంటే వ్యక్తి ధనవంతుడైతే అతను ఎక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తి తక్కువ డబ్బు సంపాదిస్తే, అతను తక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాల క్రితం 76 ఏళ్ల ఫిన్నిష్ మిలియనీర్ ఆండర్స్ విక్లాఫ్ కు అతివేగంగా కారు నడిపినందుకు 1,21,000 యూరోలు (సుమారు రూ.1.1 కోట్లు) జరిమానా విధించారు. అతను నిర్దేశించిన పరిమితి కంటే గంటకు 30 కి.మీ. ఎక్కువగా వాహనం నడిపాడు.
ఈ జరిమానా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. విక్లాఫ్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. అతని మొత్తం సంపద దాదాపు కోటి యూరోలు ఉంటుందని అంచనా. అయితే 2018లో విక్లాఫ్ కు కూడా అతివేగంగా వాహనం నడిపినందుకు 63,680 యూరోల జరిమానా విధించారు.