కమెడియన్ వాసుగి. ఈ పేరు చెబితే అసలే గుర్తుపట్టలేరు. కానీ పాకీజా అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 1990 దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాకీజా పాత్రతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకున్నారు.
వాసుకీ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగ బాబు, మంచు విష్ణు తదితరులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. అయితే ఇప్పుడామె మళ్లీ రోడ్డున పడ్డారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో నిర్వాహకుడు జల్లి కేశవరావు నటి పాకీజాకు ఆశ్రయం కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు మోహన్‌బాబు కుటుంబం రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆయన తనయుడు మంచు విష్ణు నా పరిస్థితిని చూసి నా కళ్లకు శస్త్రచికిత్స చేయించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు రూ.4 లక్షల ఆర్థిక సాయం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాకు అన్ని విధాలా సహాయపడుతున్నారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహకరించారు. జిల్లా కలెక్టర్.. పింఛనుతోపాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆదరువుగా ఉంటుంది. ఇక్కడకు వచ్చినప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు కాస్త మెరుగు పడింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, ఆప్యాయతలు మరువలేనివి‘ అని వాసుకి పేర్కొన్నారు.
