కొత్త వైరస్ బెంగళూరులో 8 నెలల చిన్నారి, 3 నెలల చిన్నారిలో HMPV ఇన్ఫెక్షన్ కనుగొన్నారు వైద్యులు. గుజరాత్‌లో 2 నెలల చిన్నారికి HMPV సోకినట్లు గుర్తించారు. కోల్‌కతాలో మరో చిన్నారికి చైనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ చిన్నారులు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే, చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్ దడపుట్టిస్తోంది.. భారత్ లో కూడా HMPV వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి.. కర్ణాటకలోని బెంగళూరులో 2, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 1, బెంగాల్‌లోని కోల్‌కతాలో 1, చెన్నైలో 2 కేసులు నమోదయ్యాయి.
దాదాపు అందరూ చిన్న పిల్లలకే HMPV వైరస్ పాజిటివ్ గా నమోదైంది.. అయితే.. పిల్లలకు ఎవరికీ విదేశీ పర్యటన చరిత్ర లేదు. వారికి ఎలా సోకింది అనే విషయాలపై వైద్య నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. ఈ వైరస్ తో ఆందోళన అవసరం లేదని.. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని.. చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. HMPV వైరస్‌పై ఆందోళన అక్కర్లేదని కేంద్రం కీలక ప్రకటన చేసింది.
HMPV వైరస్‌పై చాలా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.. ఈ వైరస్ కొత్తది కాదని , 2001 లోనే గుర్తించారని వెల్లడించారు. అయినప్పటికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. పొరుగుదేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని వెల్లడించారు. ఈనెల 4వ తేదీన కేంద్ర ఆరోగ్యశాఖ HMPV వైరస్‌పై కీలక సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు. కాగా.. ఈ కొత్త వైరస్‌లో దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే ఉన్నాయి. ఇది ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది.
తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదని డాక్టర్లు చెబుతున్నారు. ఇది న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని చెబుతున్నారు.. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు, ముఖ్యంగా శిశువులు అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో ఈ వైరస్ లక్షణాలు త్వరగా కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి వ్యాధులతో బాధపడేవారికి, ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.